Unexpected weight gain causes: నేను చాలా తక్కువ తింటానండీ.. అయినా సరే బరువు పెరిగిపోతున్నాను!” అని చాలామంది బాధపడుతుంటారు. బరువు తగ్గడానికి డైటింగ్ పేరిట కడుపు మార్చుకున్నా సరే, బరువు కరగకపోగా స్కేల్ పై నంబర్ పెరుగుతుంటే.. ఎవరికైనా చిరాకు రావడం సహజమే. అయితే.. బరువు పెరగడం అనేది కేవలం మనం తినే ఆహారం పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉండదు. మన లైఫ్ స్టైల్, శరీరంలోని హార్మోన్ల సమతుల్యత, మెటబాలిజం (జీవక్రియ) చేసే విన్యాసాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీరు తెలియకుండానే.. చేస్తున్న కొన్ని చిన్న తప్పులు బరువు పెరగడానికి ఎలా కారణమవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి ఆహారాన్ని బాగా తగ్గించేయడం చాలా మంది చేసే పెద్ద తప్పు. మీరు చాలా తక్కువ తిన్నప్పుడు మీ శరీరం అత్యవసర పరిస్థితిగా భావించి ఎనర్జీని కాపాడుకోవడానికి మెటబాలిజం (జీవక్రియ) వేగాన్ని తగ్గించేస్తుంది. దీనిని ‘స్టార్వేషన్ మోడ్’ అంటారు. దీనివల్ల మీరు ఎంత తక్కువ తిన్నా, ఆ కొద్ది పాటి ఆహారాన్ని కూడా శరీరం క్యాలరీలుగా మార్చి ఖర్చు చేయకుండా కొవ్వు రూపంలో దాచి ఉంచుతుంది.
మరో.. వైపు మనం తెలియకుండానే తీసుకునే.. ‘క్యాలరీలు’ కూడా బరువు పెరగడానికి ప్రధాన కారణం. మీరు అన్నం లేదా టిఫిన్ తక్కువ తింటుండొచ్చు, కానీ రోజంతా తాగే టీలు, కాఫీలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ లో భారీగా క్యాలరీలు దాగి ఉంటాయి. చాలా మంది ఆరోగ్యకరమైనవి అనుకుని తాగే ఫ్రూట్ జ్యూస్‌లలో కూడా చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరంలో కొవ్వును పెంచేస్తాయి.
మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. తీవ్రమైన ఒత్తిడికి.. గురైనప్పుడు శరీరంలో ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. అలాగే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతమైన నిద్ర లేకపోతే.. ఆకలిని పెంచే ‘గ్రెలిన్’ హార్మోన్ ఎక్కువై, కడుపు నిండిన భావననిచ్చే ‘లెప్టిన్’ హార్మోన్ తగ్గిపోయి బరువు పెరుగుతారు.
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మీరు తక్కువ తిన్నా బరువు పెరుగుతుంటారు. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా.. పనిచేయకపోవడం (హైపోథైరాయిడిజం) వల్ల మెటబాలిజం పడిపోయి శరీరం బరువు పెరుగుతుంది. అలాగే మహిళల్లో పీసీఓడీ లేదా పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు హార్మోన్ల తేడాల వల్ల డైటింగ్ చేస్తున్నప్పటికీ వెయిట్ తగ్గడం చాలా కష్టమవుతుంది.
Also Read: పిల్లల్లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం? తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పులే కారణం
చివరగా నీరు తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మనం తాగే.. నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి, క్యాలరీలను కరిగించడానికి ఎంతో అవసరం. రోజుకు సరి పడా నీరు తాగకపోతే.. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దానికి తోడు రోజంతా ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల మనం తీసుకునే.. కొద్ది పాటి క్యాలరీలు కూడా ఖర్చు కాక బరువుగా మారతాయి.
బరువు తగ్గడం అంటే.. కడుపు మార్చుకోవడం కాదు.. సమతుల్య తీసుకోవడం! సరైన సమయానికి .. నిద్ర పోవడం, కనీసం రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, రోజువారీ వాకింగ్ లేదా వ్యాయామం అలవాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు!