Sakkara pongal recipe: మన సంప్రదాయ పండగల సమయంలో దేవుడికి నైవేద్యంగా పెట్టే.. అత్యంత రుచి కరమైన వంటకాల్లో చక్కెర పొంగలి ముందుంటుంది. పరమాన్నం లేదా చక్కర పొంగలి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. కమ్మని నెయ్యి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లు , సువాసననిచ్చే యాలకుల పొడితో తయారయ్యే ఈ స్వీట్ తింటుంటే.. మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గుడి ప్రసాదం రుచితో ఇంట్లోనే ఈ ట్రెండీ చక్కెర పొంగలిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా!
బియ్యం, పెసరపప్పు, బెల్లంతో తయారయ్యే ఈ వంటకం కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వైట్ రిఫైన్డ్ పంచదార బదులుగా బెల్లం వాడటం వల్ల ఇది సంప్రదాయ ఆరోగ్య సూత్రాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ కమ్మనైన చక్కెర పొంగలిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్..
కొత్త బియ్యం (1 కప్పు)
పెసరపప్పు (అర కప్పు)
తురిమిన బెల్లం (1.5 కప్పులు)
నెయ్యి (4-5 టేబుల్ స్పూన్లు)
జీడిపప్పు, కిస్మిస్‌లు (గుప్పెడు)
యాలకుల పొడి (అర స్పూన్)
పచ్చ కర్పూరం (చిటికెడు-ఆప్షనల్)
1: ముందుగా స్టవ్ మీద ఒక మంద పాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి, అందులో అర స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత పెసర పప్పు వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో కప్పు బియ్యం వేసి మరో.. నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా వేయించడం వల్ల పొంగలి మంచి స్మెల్ వస్తుంది.
2: వేయించుకున్న బియ్యం, పెసర పప్పు మిశ్రమంలో 3.5 కప్పుల నీరు పోయాలి (బియ్యం, పప్పు కలిపి 1.5 కప్పులు అయితే 3.5 నుంచి 4 కప్పుల నీరు పడుతుంది). కుక్కర్ అయితే 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మామూలు గిన్నెలో అయితే మూతపెట్టి మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. పొంగలి ఎంత మెత్తగా ఉంటే అంత రుచిగా ఉంటుంది.
3: అన్నం ఉడికే లోపు వేరొక గిన్నెలో తురిమిన బెల్లం వేసి, అర కప్పు నీరు పోసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మలినాలు పోవడానికి దీన్ని ఒక సారి వడకట్టుకోవాలి. చక్కెర పొంగలికి తీపి ఎక్కువగా కావాలనుకునేవారు.. బెల్లం కొద్దిగా పెంచుకోవచ్చు.
Also Read: ట్రెడిషనల్ స్టైల్ కట్టే పొంగలి..ఇలా చేస్తే తిన్నవాళ్ళు మెచ్చుకోవాల్సిందే!
4: ఉడికించి పెట్టుకున్న అన్నం, పెసర పప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మాష్ చేయాలి. ఇప్పుడు మంటను సిమ్‌లో ఉంచి, వడకట్టు కున్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా ఉడికిన అన్నంలో పోస్తూ కలపాలి. బెల్లం నీరు అన్నంలో పూర్తిగా కలిసి ఒక గట్టి మిశ్రమం అయ్యే వరకు ఉడికించాలి.
5: ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకుని అందులో.. 3-4 స్పూన్ల నిండుగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడి పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత కిస్మిస్‌లు వేసి అవి ఉబ్బిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.దీన్ని వెంటనే తయారు చేసి పెట్టుకున్న చక్కెర పొంగలిలో కలపాలి.చివరగా యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలపాలి.
అంతే! గుమగుమలాడే గుడి ప్రసాదం లాంటి ‘చక్కెర పొంగలి’ రెడీ! పండగ రోజుల్లో లేదా ఇంట్లో ప్రత్యేక రోజులలో దీన్ని చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులతో కలిసి తినండి! ఒక్క సారి ఈ స్వీట్ తింటే ఎప్పటికీ మర్చిపోలేరు.