Sleeplessness: ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్యతో దాదాపు అన్ని ఏజ్ గ్రూప్‌లకు చెందిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కీళ్ల నొప్పులు, ఇతర కారణాల వల్ల వయసు పైబడిన వారు నిద్రపోకుండా ఉంటే అధిక స్క్రీన్ టైం వల్ల మధ్య వయసు వాళ్లు నిద్రకు దూరమైపోతున్నారు. నిద్రలేమి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో దీని వల్ల ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక టీనేజ్ పిల్లలు కూడా నిద్రలేమి సమస్యతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేక చాలా మంది విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు. ఫలితంగా చిన్నతనంలోనే చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్ పిల్లల్లో నిద్రలేమి సమస్యలు ఎందుకు వస్తున్నాయనేదానిపై అనేక అధ్యయనాలు కూడా వచ్చాయి.
ALSO READ: కెమికల్స్ కలిపిన మామిడి పండ్లను గుర్తించడమెలా..?
వాటి వల్లే అన్ని సమస్యలు:
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న చాలా మంది టీనేజ్ అమ్మాయిలు స్మార్ట్ ఫోన్, లాప్‌టాప్ వంటి వాటి ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల నిద్ర సరిగా లేకపోవడమే కాకుండా అనేక మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక స్క్రీన్ టైం వల్ల ఆడపిల్లలపైనే ఎక్కువగా చెడు ప్రభావం పడుతుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. చాలా మందిలో నిద్రలేమి కారణంగా ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తున్నాయట.
రాత్రి వేళల్లో నిద్రపోవడానికి ముందు ఫోన్ చూడడం వల్ల కళ్లతో పాటు మెదడు పనితీరుపై కూడా చెడు ప్రభావం పడుతుందట. దీని వల్ల త్వరగా నిద్ర పట్టకపోవడం, నిద్రపోయినా మధ్యలోనే మెలకువ రావడం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రెండు లేదా మూడు గంటల కంటే ఎక్కువ సేపు ఫోన్ చూస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందట.
తక్కువ స్క్రీన్ టైం వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. టీనేజర్‌లకు స్క్రీన్ టైం తగ్గించేలా తల్లిదండ్రులు చూసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి వాళ్లను రక్షించడం సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.