Pawan Kalyan : ఆ ఊరు ఎవరికీ తెలీదు. ఆ పేరు జిల్లాలోనే చాలా మంది విని ఉండరు. అడవిలో ఓదిగిపోయిన గ్రామం. అడవి బిడ్డలకు ఆవాసం. అక్కడకు బస్సు వెళ్లదు. ఎమర్జెన్సీలో అంబులెన్స్ కూడా వెళ్లలేదు. ఎందుకంటే ఆ ఊరికి అసలు రోడ్డే లేదు. ఆ ప్రాంతాన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. ఆపదొస్తే గూడెం వాసులే ఆసరా. అనారోగ్యం వస్తే ఆ దేవుడే దిక్కు. డోలీల దుస్థితి ఇంకెన్నాళ్లూ? అప్పుడొచ్చాడు ఒకడు. నేనున్నానంటూ నడిచొచ్చాడు. ఊరు తలరాత మారుస్తానంటున్నాడు. శ్రీమంతుడు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేసినట్టు.. తన శక్తి మేర సాయపడుతున్నాడు. అడవితల్లి బాట పట్టిన అతనే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
మాట ఇచ్చి.. పనులు ప్రారంభించి..
ఉప ముఖ్యమంత్రి అంటే ఏసీ ఛాంబర్లలో ఉండటం కాదన్నారు. ప్రజల్లోకి వెళ్లారు. వారి సమస్యలు విన్నారు. విని వదిలేయకుండా కార్యచరణతో ముందుకొచ్చారు. సమస్యలు తీర్చేలా కదం తొక్కుతున్నారు. 3 నెలల క్రితం ఆ అడవిలోకి వెళ్లి నేనున్నానంటూ భరోసా ఇచ్చి వచ్చారు. ఇప్పుడు ఆ గిరిజన గ్రామంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పెదపాడు గ్రామంలో గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
పవన్ విజన్.. అరకు టూరిజం
డోలీ మోత తప్పాలి.. ఇక్కడ పర్యాటకం అభివృద్ధి కావాలి అని పిలుపు నిచ్చారు పవన్. రోడ్లు అభివృద్ధి చేశాక అంబులెన్సులు గిరిజన మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నాయని అన్నారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించేలా.. అరకు టూరిజం డెవలప్‌మెంట్ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి దుర్గేష్ లతో మాట్లాడతానని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయొద్దని.. ఆ వ్యసనానికి లోను కావొద్దని పవన్ పిలుపు ఇచ్చారు.
Also Read : ఆ హీరోయిన్‌తో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైరల్ వీడియో
రోడ్లు.. భవిష్యత్తుకు రహదారులు
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే.. 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారని పవన్ చెప్పారు. గత వైసీపీ హయాంలో రోడ్లకు కేవలం 92 కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక గడిచిన 8 నెలల్లోనే 1,500 కోట్ల విలువైన రోడ్ల పనులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని.. ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.