పెరుగును క్రమం తప్పకుండా ప్రతిరోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. మంచి బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జలుబు, ఫ్లూ వంటి శీతాకాలపు వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగు తినడం వల్ల ఆహారం సాఫీగా జీర్ణం అవుతుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి జీర్ణవ్యవస్థ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రోబయోటిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి కడుపుబ్బరాన్ని కూడా నివారిస్తుంది. చలికాలంలో మీరు పెరుగును తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది.
పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. పెరుగుని చలికాలంలో పోషకాహారంగానే చెబుతారు. ఇది ఎముకల సాంద్రతతో పాటు కండర ద్రవ్యరాశిని పెంచుతుంది. చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. కాబట్టి పెరుగును తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
చల్లటి వాతావరణంలో చర్మం పొడిగా మారిపోతుంది. పెరుగు తీసుకోవడం వల్ల చర్మానికి హైడ్రేషన్ పెరుగుతుంది. అంటే చర్మం తేమవంతంగా ఉంటుంది. అలాగే చర్మానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. శీతాకాలంలో చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా చర్మం అందంగా కనిపించేలా చేయడంలో పెరుగు ముందుంటుంది.
పెరుగును తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. పెరుగు అనేది తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఒక కప్పు పెరుగు ప్రతిరోజూ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు.
చలికాలంలో ఎక్కువమందికి ఉత్సాహంగా ఉండదు. బలహీనంగా, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఈ పరిస్థితిని వింటర్ బ్లూస్ అని అంటారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఆ ఒత్తిడినే తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరిచి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. శీతాకాలపు భోజనంలో పెరుగు ఉండేలా చూసుకోండి.