Water: నీరే ప్రాణం” అని మనం తరచుగా వింటూ ఉంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, చర్మం నిగనిగలాడటానికి, బరువు తగ్గడానికి ఎక్కువగా నీరు తాగాలని చాలామంది నమ్ముతారు. అయితే.. ఏ విషయం అయినా అతిగా చేయడం మంచిది కాదు. అధికంగా నీరు తాగడం కూడా కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రోజుకు అవసరానికి మించి నీరు తాగడం వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఎదుర్కోవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. హైపోనట్రేమియా:
అధికంగా నీరు తాగడం వల్ల కలిగే అత్యంత ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్ ఇదే. దీనినే ‘వాటర్ టాక్సిసిటీ’ అని కూడా అంటారు. మనం ఎక్కువగా నీరు తాగినప్పుడు, మన శరీరంలోని సోడియం స్థాయిలు పలచబడి ప్రమాదకరంగా పడిపోతాయి. సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను, రక్తపోటును, నరాల పనితీరును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోడియం స్థాయిలు పడిపోతే.. వాంతులు, తలనొప్పి, అలసట, అయోమయం కొన్ని సందర్భాల్లో కోమాకు కూడా దారితీయవచ్చు.
2. మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది:
మూత్రపిండాలు శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపే పనిని చేస్తాయి. మనం సాధారణ స్థాయిల కంటే ఎక్కువ నీరు తాగినప్పుడు.. మూత్రపిండాలపై భారం పెరుగుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా.. శరీరంలోని ముఖ్యమైన లవణాల సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది.
3. గుండెపై అధిక భారం:
అధికంగా నీరు తాగడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. ఈ అదనపు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ శ్రమ పడాలి. ఇది గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగించి, దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
4. కండరాల బలహీనత, తిమ్మిరి:
శరీరంలోని ఎలక్ట్రోలైట్లు (సోడియం, పొటాషియం వంటివి) పలచబడటం వల్ల కండరాలు బలహీనపడతాయి. అవి సంకోచించి, వ్యాకోచించడంలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా కండరాల తిమ్మిరి, నొప్పులు, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
5. మెదడు వాపు:
శరీరంలోని సోడియం స్థాయిలు పడిపోయినప్పుడు.. మెదడులోని కణాలు నీటిని పీల్చుకొని ఉబ్బడం ప్రారంభించవచ్చు. దీనిని ‘సెరెబ్రల్ ఎడిమా’ అంటారు. ఇది తలనొప్పి, గందరగోళం, మూర్ఛ కొన్ని సందర్భాల్లో మెదడుకు తీవ్రమైన హాని కలిగించవచ్చు.
ఎంత నీరు తాగాలి ?
ఒక్కొక్కరికి రోజుకు అవసరమైన నీటి పరిమాణం వారి వయస్సు, బరువు, శారీరక శ్రమ, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా.. ఒక వ్యక్తికి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు సరిపోతుంది. ఆరోగ్య నిపుణులు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగమని సూచిస్తారు. యూరిన్ రంగు పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉంటే.. మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం. మూత్రం తేలికపాటి పసుపు లేదా రంగు లేకుండా ఉంటే, మీరు సరిపడా నీరు తాగుతున్నారని సూచిస్తుంది.