Citrus Side Effects: ఆరెంజ్, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లలో విటమిన్-సి, కరిగే ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించేందుకు ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ అతిగా తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ పండ్లలో ఎక్కువగా విటమిన్-C ఉంటుందని మనందరికీ తెలుసు. ఇది శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రుగ్మతల నుండి కాపాడుతుంది. కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడంలో కూడా సిట్రస్ పండ్లు హెల్ప్ చేస్తాయట.
పోషకాలు మాత్రమే కాకుండా, ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో గందరగోళం కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
సిట్రస్ పండ్లలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఫైబర్ అనేది ఉదర సమస్యలతో పాటు తిమ్మిరి వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై నల్లమచ్చలను తగ్గించేందుకు కూడా ఇవి సహాయపడతాయి.
అతి వల్ల హాని:
సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ పండ్లలో ఎక్కువ మాయిశ్చర్ ఉండటం వల్ల, ఎక్కువగా తినడం వలన పేగులపై చెడు ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లను పరగడుపున తీసుకోవడం వల్ల వాంతులు,కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
పండ్లలో ఉండే ఎసిడిక్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తరచుగా సిట్రస్ పండ్లను తింటే దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. దీని వల్ల సెన్సిటివిటీ ఎక్కువయ్యే ప్రమాదం ఉందట.
అధికంగా సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో మినరల్స్ అసమతుల్యత ఏర్పడవచ్చని అంటున్నారు. ముఖ్యంగా, శరీరంలో పొటాషియం లెవెల్స్ పెరగడం, కాల్షియం లోపం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ పండ్లలో సుక్రోజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే డయాబెటిస్ ఉన్నవారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ALSO READ: కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా?
పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ వీటిని మితిమీరి తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ పండ్లను మితంగా తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.