Less Sleep Side Effects: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో చాలా మంది కేవలం 4-5 గంటల నిద్రతో సరిపెట్టుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే నిద్ర లేకపోవడం క్రమంగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. నిద్ర అలసట నుంచి ఉపశమనం పొందడానికే కాకుండా ఆరోగ్యకరమైన మెదడు, గుండె, రోగ నిరోధక వ్యవస్థ, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. పరిశోధన ప్రకారం.. పెద్దలు రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. ఇలా జరగకుండా 4-5 గంటలు మాత్రమే నిద్రపోతే.. ఐదు ప్రధాన ఆరోగ్య ప్రభావాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
మానసిక అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం: నిద్ర లేమి మెదడు విశ్రాంతి తీసుకోకుండా నిరోధిస్తుంది. దీని వల్ల ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక నిద్ర లేమి అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతుంది.
గుండె ఆరోగ్యంపై ప్రభావాలు: రోజుకు 4-5 గంటలు మాత్రమే నిద్రపోయే వారికి అధిక రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల హృదయ స్పందనలు సక్రమంగా ఉండవు. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా దిగ జారిపోతాయి.
బలహీనమైన రోగనిరోధక శక్తి: నిద్ర లేకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గిపోతుంది.దీని వల్ల తరచుగా జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి.
బరువు పెరగడం: నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఆకలి, సంతృప్తిని నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అందుకే తక్కువ నిద్రపోయే వ్యక్తులు త్వరగా ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
మానసిక స్థితిలో మార్పులు, మానసిక ఒత్తిడి: దీర్ఘకాలిక నిద్ర లేమి చిరాకు, ఆందోళన, నిరాశను పెంచుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా సంబంధాలు, పని రెండింటినీ ప్రతికూలంగా ఎంతో ప్రభావితం చేస్తుంది.