Face Serum: ఫేస్ సీరం అనేది స్కిన్ కేర్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది చర్మాన్ని మెరుగుపరచడానికి, కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఫేస్ సీరమ్‌లో అధిక సాంద్రతలో ఉండే క్రియాశీల పదార్థాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, రెటినాల్, హయలూరోనిక్ ఆమ్లం , ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఫేస్ సీరం వాడేటప్పుడు కొన్ని దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దుష్ప్రభావాలు:
చాలా మందికి ఫేస్ సీరం వల్ల దుష్ప్రభావాలు ఉండవు. కానీ సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి.. లేదా తప్పుడు సీరం వాడుతున్న వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
చర్మంపై ఇరిటేషన్, ఎరుపు రంగు, దురద:
ముఖ్యంగా రెటినాల్ లేదా విటమిన్ సి వంటి యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ ఉన్న సీరం ఉపయోగించినప్పుడు, చర్మంపై ఎరుపు రంగు, దురద, మంట వంటి సమస్యలు రావచ్చు. ఇది చర్మం ఆ పదార్థాలకు అలవాటు పడే దశలో జరుగుతుంది. ఈ సమస్య కొనసాగితే, సీరం వాడటం ఆపేసి.. స్కిన్ కేర్ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. సీరం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.
మొటిమలు:
కొందరిలో.. కొత్త ఫేస్ సీరం వాడటం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నూనె ఆధారిత సీరమ్‌లు లేదా చర్మానికి సరిపడని సీరం ఉపయోగించినప్పుడు ఇది జరుగుతుంది. నాన్-కొమెడోజెనిక్ అని లేబుల్ చేసిన సీరమ్‌ను ఎంచుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.
పొడి చర్మం లేదా పెళుసుగా మారడం:
కొన్ని యాసిడ్స్.. ముఖ్యంగా సెలసిలిక్ యాసిడ్ లేదా ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ వాడడం వల్ల చర్మం పొడిగా లేదా పెళుసుగా మారవచ్చు. ఈ సమస్యను నివారించడానికి సీరం వాడిన తర్వాత మంచి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి.
సూర్యరశ్మికి సున్నితత్వం:
విటమిన్ సి, రెటినాల్ వంటి పదార్థాలు చర్మాన్ని సూర్యరశ్మికి మరింత సున్నితంగా చేస్తాయి. కాబట్టి.. ఈ సీరమ్స్ వాడిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ ఉపయోగించాలి.
అలెర్జీ ప్రతిచర్యలు:
సీరమ్‌లో ఉన్న రంగుల వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొత్త ఉత్పత్తిని వాడే ముందు, చెవి వెనుక భాగంలో లేదా మణికట్టుపై కొద్దిగా సీరం వేసి.. ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
Also Read: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా ? జాగ్రత్త
జాగ్రత్తలు:
మొదటిసారి సీరం వాడేటప్పుడు.. వారంలో 2-3 సార్లు మాత్రమే వాడాలి. చర్మం అలవాటు పడిన తర్వాత, క్రమంగా రోజువారీ వాడకాన్ని ప్రారంభించండి.
సరైన ఉత్పత్తిని ఎంచుకోండి: మీ చర్మ రకం, అవసరాలకు సరిపోయే సీరమ్‌ను ఎంచుకోండి.
ప్యాచ్ టెస్ట్ చేయండి: ఏ కొత్త ఉత్పత్తిని వాడేటప్పుడు అయినా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి.
ఫేస్ సీరం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దానిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ముఖ్యం. మీ చర్మానికి సరి పోని లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేసి, నిపుణులను సంప్రదించడం వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.