Road Accident: జమ్ముకశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం రాంబన్ జిల్లాలోని ఉఖ్రాల్ పోగల్ పారిస్థాన్ తహసీల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ప్రమాద స్థలంలో విషాదం
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు, ప్రమాదం జరిగిన సమయంలో.. టాటా సుమో వాహనం రన్నింగ్‌లో ఉంది. ఈ సమయంలో డ్రైవర్‌కు నియంత్రణ తప్పడంతో.. వాహనం సుమారు 600 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక చర్యలు ప్రారంభించి, వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
ప్రాణాపాయ పరిస్థితిలో గాయపడిన వారు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని.. స్థానిక ఉఖ్రాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం బనిహాల్ SDHకి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ముగ్గురు బాధితులు మరణించారు. మిగతా బాధితుల్లో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.
పోలీసుల దర్యాప్తు
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన రద్దీ, మార్గంలో దుర్గమమైన పరిస్థుతులు వంటి కోణాల్లో విచారణ కొనసాగుతోంది. వాహనానికి లోపాలున్నాయా? వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి దారితీసాయా? అన్న అంశాలపై కూడా అధికారుల దృష్టి సారించారు.
లోయలో సహాయక చర్యలు
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు మృతదేహాలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరగడంతో.. సహాయక చర్యలు కొంచెం కష్టతరమైంది. అయినప్పటికీ బాధితులను గుర్తించి వారిని ఆస్పత్రులకు తరలించారు.
Also Read: ఫంక్షన్ హాల్ కోసం.. సొంత బావను దారుణంగా కత్తితో నరికి
ఈ ఘటన పర్యాటక ప్రాంతాల్లో రహదారి భద్రతపై.. మరోసారి ప్రశ్నలు కలిగిస్తోంది. సుదీర్ఘ వంకర్లు మిద్దెలు, ప్రమాదకర మార్గాలు, వాహనాల నిర్వహణ లోపం వంటి అంశాలు.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రతి పర్యాటకుడు, డ్రైవర్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం కూడా తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో తగిన హెచ్చరికలు ఏర్పాటు చేయాలి.