Signs of Kidney Damage: మన శరీరంలో కిడ్నీలు చాలా కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను తొలగించడం, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన పనులను ఇవి నిర్వర్తిస్తాయి. కిడ్నీ వ్యాధులు సాధారణంగా నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతాయి. కానీ కొన్నిసార్లు ఉదయం పూట కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీల ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి ఈ లక్షణాలు సంకేతాలు కావచ్చు.
1. ఉదయం పూట కాళ్ళ వాపు :
ఉదయం నిద్ర లేవగానే కాళ్ళు లేదా చీలమండల వద్ద వాపు కనిపిస్తే.. అది కిడ్నీల పనితీరులో లోపం ఉందని సూచించవచ్చు. రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో అదనపు ద్రవాలు నిలిచిపోతాయి. ముఖ్యంగా, ఉదయం పూట కాళ్ళ వాపు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాపును ఎడెమా అని అంటారు. కిడ్నీలు ఉప్పును, నీటిని సమర్థవంతంగా తొలగించలేనప్పుడు ఈ సమస్య వస్తుంది.
2. ఉదయం పూట కళ్ల చుట్టూ వాపు:
ఉదయం పూట కళ్ళ క్రింద లేదా కనురెప్పల పైన వాపు లదా పఫీనెస్ కనిపిస్తే.. అది కిడ్నీలు దెబ్బతిన్నాయని సూచించవచ్చు. కిడ్నీలు ప్రోటీన్లను రక్తం నుంచి మూత్రంలోకి వడపోస్తాయి. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు.. ఈ ప్రోటీన్లు లీక్ అయ్యి మూత్రంలోకి వెళ్తాయి. దీని వల్ల రక్తంలో ప్రోటీన్ల స్థాయి తగ్గి, శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. ఈ ద్రవాలు కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన కణజాలంలో పేరుకుపోవడం వల్ల ఉదయం పూట ఈ వాపు స్పష్టంగా కనిపిస్తుంది.
3. యూరిన్ రంగు మారడం:
కిడ్నీ వ్యాధి ఉన్నవారికి ఉదయం పూట మూత్రం రంగులో.. దాని స్వభావంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. రాత్రి సమయంలో యూరిన్ పేరుకుపోయి ఉదయం పూట దీని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలో కొన్ని రకాల మార్పులు ఉంటాయి:
యూరిన్ నురుగుగా ఉండటం: మూత్రంలో నురుగు ఎక్కువగా కనిపిస్తే.. దానిలో ప్రోటీన్ల లీకేజ్ ఎక్కువగా ఉందని అర్థం.
యూరిన్ రంగులో మార్పు: మూత్రం ముదురు పసుపు రంగులో లేదా ఎరుపు రంగులో ఉంటే, అది రక్తస్రావానికి సంకేతం కావచ్చు. ఇది కిడ్నీల ఆరోగ్యం సరిగ్గా లేదని సూచిస్తుంది.
4. ఉదయం పూట అలసట, బలహీనత:
ఉదయం లేచిన వెంటనే తీవ్రమైన అలసట, బలహీనత ఉంటే, అది కిడ్నీల సమస్యకు సంకేతం కావచ్చు. కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి, రక్తహీనత ఏర్పడుతుంది. ఈ రక్తహీనత ఉదయం పూట తీవ్రమైన అలసట, నీరసాన్ని కలిగిస్తుంది.
Also Read: ఫ్యాటీ లివర్ సమస్యా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్
5. ఉదయం పూట దురద:
ఉదయం నిద్ర లేవగానే శరీరం అంతా విపరీతమైన దురదగా అనిపిస్తే.. అది కూడా కిడ్నీల సమస్యకు ఒక అసాధారణ సంకేతం. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే.. రక్తంలో టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. ఈ వ్యర్థాలు చర్మంలోకి చేరి దురద, దద్దుర్లు, పొడి చర్మానికి కారణమవుతాయి. ఉదయం పూట శరీరం చల్లగా.. నిశ్చలంగా ఉన్నప్పుడు ఈ దురద ఎక్కువగా ఉంటుంది.
ఈ అసాధారణ లక్షణాలు మీలో కనిపిస్తే.. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. సరైన సమయంలో కిడ్నీ వ్యాధిని గుర్తించడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. మరింత తీవ్రం కాకుండా జాగ్రత్త పడవచ్చు. కిడ్నీల ఆరోగ్యం కోసం సరైన ఆహారం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.