Sorakaya Menthaku Pachadi: రోజూ రొటీన్ కూరలు, పచ్చళ్లు తిని విసిగిపోయారా? కొత్తగా, టేస్టీగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తోందా? అయితే ..మీకోసమే ఈ అద్భుతమైన రెసిపీ. అదే సొరకాయ మెంతాకు రోటి పచ్చడి. ఈ కాంబినేషన్ వినడానికి కొత్తగా అనిపించినా, రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొరకాయ, శరీర వేడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే మెంతాకు కలిపి చేసే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ రెసిపీని ఇంట్లోనే చాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
సొరకాయ ముక్కలు – 1 కప్పు
మెంతాకు (మెంతి కూర)-1 కప్పు
పచ్చిమిర్చి -6 నుంచి 8
టమాటో ముక్కలు-అర కప్పు
చింతపల్లి -చిన్న నిమ్మకాయ సైజు అంత
వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8
జీలకర్ర -1 స్పూన్
నూనె -సరిపడా
ఉప్పు -రుచికి సరిపడా
పోపు దినుసులు (ఆవాలు, మినపప్పు, కరివేపాకు)-కొద్దిగా
తయారీ విధానం:
1.మొదటగా.. సొరకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మెంతాకును వొలుచుకుని నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చి మిర్చి వేసి కొద్దిగా వేయించాలి. పచ్చి మిర్చి వేగిన తర్వాత ముందుగా.. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అందులో వేయాలి. సొరకాయ ముక్కలు మెత్తబడే.. వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. సొరకాయలో.. నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి.
2.సొరకాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత, శుభ్రం చేసి పెట్టుకున్న మెంతాకును అందులో కలపాలి. మెంతాకు వేసిన వెంటనే ఆకు వాడిపోయి మెత్తగా అవుతుంది. ఆ తర్వాత టమాటో ముక్కలు,చింతపండు వేసి అన్నింటిని బాగా కలపాలి. టమాటో ముక్కలు పూర్తిగా మగ్గి గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టాలి.
3.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. లేదా రోలు అందుబాటులో ఉంటే రోట్లో నూరుకుంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మిక్సీ జార్ లో ఉడికించిన మిశ్రమం, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. రోటి పచ్చడి అంటే కొద్దిగా బరకగా.. ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. చివరగా.. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, చిన్న ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును పచ్చడిలో కలిపితే ఘుమఘుమలాడే సొరకాయ మెంతాకు రోటి పచ్చడి రెడీ.
Also Read: 10 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ రవ్వ ప్రసాదం..ఈజీగా చేయండిలా!
ఆరోగ్య ప్రయోజనాలు:
సొరకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా పని చేస్తుంది. అలాగే మెంతాకు జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడంలో సహాయ పడుతుంది. ఈ రెండింటి వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
ఈ వీకెండ్ లో మీ ఇంట్లో ఈ టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ మెంతాకు రోటి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. కుటుంబ సభ్యులందరూ లొట్టలేసుకుంటూ తింటారు!