Godhuma ravva prasadam recipe: ఇంట్లో పూజలు లేదా పండగలు సమయంలో దేవునికి.. నైవేద్యం పెట్టడానికి త్వరగా అయిపోయే.. ప్రసాదం ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే.. కేవలం పది నిమిషాల్లో ఎంతో రుచికరంగా, గుమగుమలాడే గోధుమ రవ్వ ప్రసాదాన్ని తయారు చేయెచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వతో.. చేసే ఈ ప్రసాదం పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ విపరీతంగా నచ్చుతుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఈ ప్రసాదాన్ని తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గోధుమ రవ్వ : 1 కప్పు
బెల్లం లేదా పంచదార: 1 కప్పు (మీ రుచిని బట్టి వాడుకోవచ్చు)
నెయ్యి: 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
నీళ్లు: 2.5 నుంచి 3 కప్పులు
జీడిపప్పు, కిస్మిస్: తగినన్ని
యాలకుల పొడి: అర టీస్పూన్
పచ్చ కర్పూరం: చిటికెడు (మంచి సువాసన కోసం)
1. ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ రవ్వను వేయాలి. రవ్వ మంచి సువాసన వచ్చే వరకు, రంగు మారేంత వరకు మీడియం మంటపై 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో.. రవ్వను వేయించడం వల్ల ప్రసాదం చాలా మంచి వాసన వస్తుంది.
2. గోధుమ రవ్వ బాగా వేగిన తర్వాత, అందులో సుమారు 2.5 నుంచి 3 కప్పుల వేడి నీటిని పోయాలి. నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా కలపాలి. మంటను మీడియం వేడిలో ఉంచి గిన్నెపై మూత పెట్టాలి. గోధుమ రవ్వ మెత్తగా ఉడికే.. వరకు సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. రవ్వ పూర్తిగా ఉడికిందా లేదా అని చేతితో నొచ్చి చూస్తే మెత్తగా అయిపోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాతే బెల్లం లేదా పంచదార కలపాలి. ఒక వేళ మీరు బెల్లంతో చేస్తుంటే.. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించి వడకట్టి ఆ నీటిని రవ్వలో కలుపుకోవచ్చు. లేదా నేరుగా తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం లేదా పంచదార కరిగే కొద్ది ప్రసాదం కొద్దిగా పల్చగా అవుతుంది. మంటను సిమ్‌లో ఉంచి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
3. ప్రసాదం దగ్గరకు పడిన తర్వాత, మిగిలిన రెండు స్పూన్ల నెయ్యిని చుట్టూ వేయాలి. దీని వల్ల ప్రసాదం అడుగు అంటకుండా చాలా మృదువుగా వస్తుంది. చివరగా అర టీస్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను, చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
Also Read: రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు
గోధుమ రవ్వ ఉడికేటప్పుడు చల్లటి నీళ్లకు బదుಲು వేడి నీళ్లు పోస్తే రవ్వ త్వరగా ఉడుకుతుంది.
బెల్లంతో చేస్తే.. ఈ ప్రసాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
ప్రసాదం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండటానికి నెయ్యి సరిపడా వేయడం ముఖ్యం.
ఎలాంటి హడావిడి లేకుండా కేవలం పది నిమిషాల్లో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ గోధుమ రవ్వ ప్రసాదం పూజలకు వాడొచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ అద్భుతమైన ప్రసాదాన్ని ఈసారి పండగకు లేదా పూజకు తప్పకుండా ట్రై చేయండి.