Shahjahanpur Girls: ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా నిగోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరైయా గ్రామంలో సోమవారం ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజూ లాగే పొలాల వైపు వెళ్తున్న గ్రామస్తులకు, ఊరి చివర ఉన్న ఒకే జామచెట్టుకు ఇద్దరు మైనర్ బాలికల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఊరి ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
రీల్స్ చేస్తూ సరదాగా ఉండే బాలికలు
మృతి చెందిన బాలికల వయసు 17, 15 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వరుసకు దగ్గరి బంధువులే కాకుండా చాలా మంచి స్నేహితులు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఎప్పుడూ కలిసే ఉండేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా, వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ పోస్ట్ చేసే అలవాటు కూడా ఉందట. నిన్నటి వరకు ఎంతో సంతోషంగా కనిపించిన వీరు, ఇలా తెల్లారేసరికి శవాలై తేలడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పోలీసుల విచారణ.. తేలాల్సి ఉన్న అసలు కారణాలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది ఆత్మహత్యా లేక దీని వెనుక వేరే ఏదైనా కోణం ఉందా అనే విషయాలు ఇంకా స్పష్టమవ్వలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని, అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
Also Read: రాహుల్ గాంధీ.. రైజింగ్ స్టార్‌గా ఎదుగుతున్నారా?