Visakhapatnam-Bhogapuram Airport Connectivity: విశాఖపట్నంలో మరో కొత్త ప్రయాణ మార్గం అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం సిటీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ప్రధానంగా రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, త్వరలో సముద్ర మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుంది.
విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్ ను కేంద్రంగా చేసుకుని సముద్ర మార్గంలో ప్రయాణ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. క్రూయిజ్ టెర్మినల్ నుంచి సాగర్ నగర్ మీదుగా ముక్కం ప్రాంతం వరకు క్రూయిజ్ లేదంటే ఫెర్రీ కనెక్టివిటీని తీసుకురావాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మార్గం అందుబాటులోకి వస్తే విశాఖలోని కీలక ప్రాంతాలను సముద్ర మార్గంతో అనుసంధానించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులకు ఈ ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
సముద్ర మార్గంతో పాటు రోడ్డు కనెక్టివిటీని కూడా కలిపి అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. క్రూయిజ్, ఫెర్రీ బోటు ద్వారా ప్రయాణికులు ముక్కం ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భోగపురం విమానాశ్రయానికి వెళ్లేలా కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంటే, ప్రయాణం పూర్తిగా బోటు మీదే ఉండదు. సముద్ర మార్గం, రోడ్డు మార్గం రెండింటినీ కలిపి విమానాశ్రయానికి చేరుకునేలా రవాణా వ్యవస్థను రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రతిపాదన కేవలం విమానాశ్రయ ప్రయాణానికే పరిమితం కాకుండా విశాఖపట్నం పర్యాటక రంగానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. సముద్ర ప్రయాణం ద్వారా నగరంలోని తీర ప్రాంతాలను వీక్షించే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. విశాఖ ఇప్పటికే బీచ్‌లు, సముద్ర తీర ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో క్రూయిజ్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే నగరానికి వచ్చే పర్యాటకులకు మరో కొత్త ఎక్స్ పీరియెన్స్ పొందే అవకాశం ఉంటుంది.
అయితే, ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉంది. ప్రాజెక్టు అమలుకు సంబంధించి పూర్తి స్థాయి అధ్యయనం, మార్గం, ప్రయాణ సమయం, బోట్ల మెయింటెనెన్స్, భద్రత, ఖర్చు లాంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి అవసరమైన చర్యలు చేపడితే విశాఖ నుంచి భోగపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణ విధానంలో కీలక మార్పు వచ్చే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్ బుల్లెట్ రైళ్ల స్పీడుపై షాకింగ్ అప్‌డేట్.. ఏంటీ, మరీ అంత తక్కువా?