ఉదయం నిద్రలేచిన వెంటనే మంచినీరు తాగితే జీర్ణ క్రియ సాఫీగా అవుతుందనేది వైద్యులు కూడా నిర్థారించిన వాస్తవం. కొంతమంది గోరు వెచ్చని నీటిని తాగాలని చెబుతారు. మరికొందరు నీటిలో తులసి ఆకులు మరిగించాలని, ఇంకొందరు నీటిలో కాస్త తాటి కలకండ మరిగించి తాగాలని సలహా ఇస్తుంటారు. అయితే అనాస పువ్వు వేసి నీటిని మరిగించి తాగితే మరిన్ని లాభాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
అనాస పువ్వు..
అనాస పువ్వు మనందరికీ సుపరిచితమే. బిర్యానీ లవర్స్ కి ఇది బాగా తెలుసు. వెజ్ కర్రీస్ లో కూడా మసాలా దినుసుగా అనాస పువ్వుని ఉపయోగిస్తుంటారు. అయితే ఇది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు. దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే దీనిలోని ఔషధ గుణాలు మన జీర్ణ శక్తికి ఎంతగానో తోడ్పడతాయి.
స్టార్ అనిస్..
అనాస పువ్వుని స్టార్ అనిస్ లేదా, చక్ర ఫూల్ అని కూడా పిలుస్తారు. దీనిలోని షికిమిక్ యాసిడ్ వైరస్ ల ద్వారా వచ్చే వ్యాధుల్ని నియంత్రిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ, ఇతర జ్వరాలను దరిచేరనివ్వదు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల అనాస పువ్వుని మన పూర్వీకులు కూడా పలు ఔషధాల్లో ఉపయోగించేవారని తెలుస్తోంది. అయితే రాను రాను ఇలాంటి ఔషధాలు మరుగునపడిపోయాయి. ఇప్పుడు మనం అనాస పువ్వుని కేవలం ఒక మసాలా దినుసుగానే ఉపయోగిస్తున్నాం. వాస్తవానికి మన వంటింట్లో మనం కూరల్లో వాడే మసాలా దినుసుల్లో చాలా వాటికి ఔషధ గుణాలుంటాయి. వాటిని తగిన మోతాదులో తీసుకుంటే ఫలితం ఉంటుంది. అందులో అనాస పువ్వు అనేది మరింత మేలు చేసే మసాలా దినుసు.
అనాసపువ్వు – నీరు
అనాస పువ్వుని నీటిలో వేసి, ఆ నీటిని మరిగించి తాగడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది కూడా. అనాస పువ్వులో ఉన్న కార్మినేటివ్ లక్షణాలు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకు కూడా ఇది ఉపశమనం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఇక
తలనొప్పి, మైగ్రేన్ నుండి కూడా ఈ నీరు ఉపశమనం కలిగిస్తుంది. అనాస పువ్వుతో టీ కూడా చేసుకుంటారు. టీలో అల్లం బదులు దీన్ని వాడుతుంటారు. అనాసపువ్వు వేసిన టీ తాగితే వెంటనే తలనొప్పి హుష్ కాకి అంటుంది.
యాంటీ ఆక్సిడెంట్..
అనాసపువ్వు యాంటీ ఆక్సిడెంట్ కూడా. అంటే మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఇది తొలగిస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. షుగర్ పేషెంట్లకు కూడా అనాస పువ్వు ఓ వరం అని చెప్పాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని కూడా చెబుతుంటారు. చివరిగా ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందనే ప్రచారం ఉంది. అయితే దీన్ని కేవలం ఓ రెమెడీగా మాత్రమే ఉపయోగించాలి. వివిధ వ్యాధులకు మనం రోజూ తీసుకునే వైద్యం కొనసాగిస్తూనే.. అనాసపువ్వు నీరు తాగితే ఫలితం కనపడుతుందని అంటారు.