శాస్త్రీయ పరిశోధనలు మన జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తాయి. అవి మన అనారోగ్యాలను, మన ఆయుష్షును కూడా ముందుగానే అంచనా వేస్తాయి. ఇప్పుడు ఒక చిన్న శారీరక పరీక్ష మన ఆయుష్షును అంచనా వేయగలరని ఒక తాజా అధ్యయనంలో తెలిసింది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ అనేది మీరు ఎంత కాలం జీవిస్తారో చెప్పేస్తుంది.
సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ ఎలా చేయాలి?
సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ అనేది చేయడం చాలా సులువు. దీనికోసం పక్కన వైద్యులు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ల్యాబ్‌లకు కూడా వెళ్లక్కర్లేదు. ఈ పరీక్ష మీరు ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ చేసుకోవడానికి ముందుగా మీరు నేలపై కూర్చోవాలి. ఆ తర్వాత పైకి లేవాలి. ఇది చాలా సింపులే కదా అనుకోవచ్చు. పైకి లేస్తున్నప్పుడు మీరు చేతుల సహాయాన్ని తీసుకోకూడదు. ఏ ఆధారాన్ని పట్టుకోకూడదు. మీకు మీరు కింద మటం వేసుకుని కూర్చొని, అలా లేచి నిల్చోవాలి. ఇది మీ నిలబడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. శరీరం ఎంత సమతుల్యంగా, సరళంగా ఉందో కనిపెడుతుంది.
ఈ పరీక్షతో ఆయుష్షు తేలిపోతుంది
ఈ సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ అనేది సింపుల్ గా కనిపిస్తున్నా దీనిలో అంచనాలు మాత్రం అధికంగానే ఉంటాయి. మన కండరాల బలం, గుండె ఎలా పనిచేస్తుంది? హృదయనాళ వ్యవస్థ ఎలా ఉంది? అనేది ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. ఈ పరిశోధనలో 46 ఏళ్ల నుంచి 75 సంవత్సరాల మధ్య గల 4 వేల మందికి పైగా వ్యక్తులు పాల్గొన్నారు. తక్కువ మార్కులు పొందిన వారికి మరణం రేటు అధికంగా ఉంటుందని తేల్చి చెప్పారు. కూర్చోవడానికి 5 మార్కులు, నిలబడడానికి ఐదు మార్కులు ఇచ్చారు. 12 సంవత్సరాల పాటు ఈ సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ ను చేశారు. ఈ కాలంలో తక్కువ మార్కులు పొందిన వారిలో 665 మంది మరణించినట్టు అధ్యయనంలో తేలింది.
సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ చేసిన వారిలో పదికి పది మార్కులు వచ్చిన వారిలో మరణాల రేటు తక్కువగా 3.7 శాతం ఉంది. అదే 8 మార్కులు వచ్చిన వారిలో ఈ రేటు 11 శాతంగా ఉంది. ఇక సున్నా నుంచి నాలుగు మార్కుల మధ్య వచ్చిన వారిలో మరణాల రేటు 42 శాతంగా ఉన్నట్టు గుర్తించారు.
సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ లో మార్కులు తక్కువ పొందిన వారిలో గుండె పని చేసే సామర్థ్యం బలహీన పడినట్టు గుర్తించారు. ధమనులు గట్టిపడటం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల వీరికి అకాల వృద్ధాప్యం వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే హృదయం కొట్టుకునే వేగాన్ని నియంత్రించే నాడీ వ్యవస్థ కూడా బలహీనపడి వారికి త్వరగా మరణం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ ను ఎవరైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాంటి చేతుల సాయం మద్దతు లేకుండా కింద మటం వేసుకొని కూర్చుని అలాగే ఎలాంటి ఆధారం మద్దతు లేకుండా నిల్పోవాలి. అలా నిల్చోగలిగితే మీ ఆరోగ్యం చక్కగా ఉన్నట్టే.