ఆరోగ్యం విషయంలో అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మహిళల మొత్తం ఆరోగ్యంలో ఋతుచక్రం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆడపిల్లలు మొదటి రుతుస్రావం అయిన వయస్సు… వారి ఆరోగ్యం విషయంలో పెద్ద పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
రజస్వల వయసును బట్టి
ఆడపిల్లలు ఏ వయసులో రజస్వల అవుతారో… ఆ వయసును బట్టి ఆమె దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి అంచనా వేయొచ్చని ఒక అధ్యయనం వివరిస్తోంది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఎండోక్రయిన్ సొసైటీ వార్షిక సమావేశంలో అధ్యయనం గురించిన వివరాలు తెలిపారు. బ్రెజిల్ అధ్యాపకులు దీన్ని పరిశోధించారు. మొదటి ఋతుస్రావం జరిగిన వయస్సును బట్టి భవిష్యత్తులో ఆ మహిళలు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, పునరుత్పత్తి ఆరోగ్య సమస్యల బారిన పడతారో లేదో ముందుగానే అంచనా వేయొచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.
మొదటి రుతుస్రావాన్ని ఏమంటారు?
మొదటి రుతుస్రావాన్ని మెనార్చే అని పిలుస్తారు. ఇది సాధారణంగా 10 నుండి 16 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లల్లో సంభవిస్తుంది. సగటున పన్నెండున్నర సంవత్సరాలు వచ్చేసరికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన బ్రెజీలియన్ అధ్యయనం ప్రకారం రజస్వల అనేది భవిష్యత్తు ఆరోగ్యాన్ని సూచిస్తుందని, ఆ రెండింటి మధ్య అనుబంధం కలిగి ఉందని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా 35 నుండి 74 సంవత్సరాల మధ్య గల 7,623 మందిపై అధ్యయనం చేశారు. ఆ మహిళ డేటాను విశ్లేషించారు.
10 ఏళ్ల వయసుకు ముందు
ఆ విశ్లేషణ ప్రకారం మొదటి రుతుస్రావం 10 సంవత్సరాల వయసుకు ముందే సంభవించిన వారిలో ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, ప్రీ ఎక్లాంప్సియా వంటి ఆరోగ్య ప్రమాదాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నట్టు గుర్తించారు.
ఆలస్యంగా తురుస్రావం అయితే
ఇక 15 సంవత్సరాల వయసు తర్వాత తొలిసారి రుతు స్రావం జరిగిన స్త్రీలలో ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ అని ఈ అధ్యయనం తేల్చింది. అలాగే పీరియడ్స్ క్రమరాహిత్యంగా రావడం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా వీరిలోనే ఎక్కువ అని తెలుస్తోంది.
ఎప్పుడు ఆరోగ్యకరం?
సాధారణంగా రుతుస్రావం పదేళ్లు వయసు తరువాత, 15 ఏళ్లకు ముందు సంభవిస్తే అది ఆరోగ్యకరం. ఆ వయసులో ఉన్న ఆడపిల్లలకు తొలిసారి రుతుక్రమం మొదలైతే వారి ఆరోగ్యం భవిష్యత్తులో కూడా చక్కగా ఉంటుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
బ్రెజిల్ లోని సావోపాల్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రజస్వల పదేళ్ల వయసుకు ముందు అయినా, 15 ఏళ్ల వయసు తర్వాత అయినా కూడా రెండు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని చెబుతున్నారు. ముందస్తు ఋతుస్రావం అనేది జీవక్రియ, గుండె సమస్యలను పెంచితే… ఆలస్యంగా ఋతుస్రావం మొదలవడం అనేది ఊభకాయానికి దారితీస్తుంది. అలాగే రుతుసమస్యలను, గుండె సమస్యలను కూడా పెంచేస్తుంది.
ఈ పరిశోధనల ప్రకారం ఒక మహిళ మొదటి రుతుస్రావం ఏ వయసులో అయిందో తెలుసుకోవడం వల్ల వైద్యులు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది అని అధ్యయనకర్తలు చెబుతున్నారు.