భారతదేశాన్ని ఒకప్పుడు బంగారు దేశంగా పిలుచుకునేవారు. మనదేశంలో ఎన్నో బంగారు గనులు బయటపడ్డాయి. బ్రిటిష్ వారిని ధనవంతులను చేసింది కూడా మన బంగారమే. వారు మన దేశం నుండి దాదాపు 900 కిలోల బంగారాన్ని తీసుకువెళ్లారని చెప్పుకుంటారు. అందులో కూడా కర్ణాటకలోని కేజిఎఫ్ గనుల నుంచే వారు ఆ తొమ్మిది వందల కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని చెబుతారు. అక్కడ అంత పెద్ద బంగారు నిల్వలు కనుగొన్నారు.
కేజీఎఫ్ ఎప్పుడు మూసేశారు?
స్వాతంత్య్రానికి ముందు కర్ణాటకలో కోలార్ బంగారు క్షేత్రాలు ఉండేవి. అక్కడ నుంచి ప్రతిరోజూ కిలోల కొద్దీ బంగారాన్ని బయటకు తీసేవారు. కానీ పాతికేళ్ల క్రితం దీన్ని మూసివేశారు. ఇప్పుడు మళ్లీ ఈ బంగారు గని తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏటా కిలోల కొద్దీ బంగారం
స్వాతంత్య్రానికి ముందు కేజీఎఫ్ గనుల నుండి ఏటా దాదాపు 750 కిలోల బంగారాన్ని తీసేవారని చెప్పుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఆ కేజిఎఫ్ ను తిరిగి ఓపెన్ చేస్తే భారతదేశంలో బంగారానికి లోటే ఉండదు. మన దేశం బంగారం కోసం ఇతర దేశాలపై ఆధారపడడం కూడా చాలా తగ్గుతుంది. దీనివల్ల విదేశీ కరెన్సీ కూడా ఆదా అవుతుంది. అలాగే మన దేశంలో బంగారం ధరలు కూడా చాలా తగ్గుతాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వాడే దేశం మనదే. మన ప్రజలలో బంగారు ఆభరణాలపై కోరిక అధికంగా ఉంటుంది. అందుకే మన అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వం ఏటా వందల టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం మనం అధిక మొత్తంలో డబ్బులు కూడా చెల్లించాల్సి వస్తుంది. అదే కేజిఎఫ్ నుంచి బంగారు తవ్వకాలు ప్రారంభిస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది.
కోలార్ బంగారు క్షేత్రాలు బ్రిటిష్ కాలంలో అతి పెద్ద బంగారు నిల్వ గనులుగా చెప్పుకుంటారు. బ్రిటిష్ పాలనలోనే ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని ఇక్కడి నుంచి తీసేవారు. 1880 నుండి 120 ఏళ్లలో ఇక్కడ నుండి దాదాపు 900 టన్నుల బంగారాన్ని తీశారని చెప్పుకుంటారు.
మినీ ఇంగ్లాండ్ అని పిలుస్తారు
ఈ కోలార్ బంగారు క్షేత్రాలను ఒకప్పుడు మినీ ఇంగ్లాండ్ అని కూడా పిలుచుకునేవారు. ఇక్కడ ఎంతోమంది బ్రిటన్ పౌరులు నివసించేవారు. అలాగే దీన్ని బంగారు నగరం అని కూడా పిలిచేవారు. ఇక్కడి బంగారంతోనే ఇంగ్లాండ్ మరింత సంపన్న దేశంగా మారింది. భారతదేశ చరిత్రలో కూడా కేజీఎఫ్ గురించి ప్రస్తావన ఉంది.
టిప్పు సుల్తాన్ కూడా…
చోళ సామ్రాజ్యంలో కూడా ఈ కోలార్ బంగారు నిల్వల ప్రస్తావన వచ్చిందని చెప్పుకుంటారు. చోళ సామ్రాజ్యంలో 1004 నుండి 1116 వరకు కూడా ఉన్న శాసనాల్లో ఇక్కడ బంగారు తవ్వకాలు జరిగాయని ప్రస్తావించారు. అలాగే విజయనగర రాజవంశం పాలనలోకి వచ్చాక కూడా ఇక్కడ బంగారాన్ని తవ్వి తీశారని చెబుతారు. అలాగే మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ కూడా 1750 నుండి 1760 మధ్య ఈ బంగారు గనుల నుంచి కొంత బంగారాన్ని తవ్వి తీయించాడని అంటారు.
భారతదేశంలో బ్రిటన్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటినుంచి ఎంతో బంగారాన్ని వారు దోచుకున్నారు. వారి కాలంలోనే కోలార్ బంగారు క్షేత్రాల్లో తవ్వకాలు అధికంగా జరిగాయి. స్వాతంత్య్రానికి ముందే ఎన్నో టన్నుల బంగారం ఇంగ్లాండుకు చేరిపోయింది. స్వాతంత్రం తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది కేజీఎఫ్. అయితే ఇక్కడ దొరుకుతున్న ముడి ఖనిజంలో బంగారం శాతం తగ్గిపోవడం అలాగే తవ్వకాల వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం 2001 మార్చి 21న ఈ గనులను పూర్తిగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అప్పుడు నుంచి కేజిఎఫ్ నుంచి తులం బంగారం కూడా బయటికి రాలేదు. ఇప్పుడు మళ్లీ దానిని తవ్వేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.