పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులనే కాదు.. రెండు కుటుంబాలను కలిపే పవిత్రమైన బంధం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని వేరే ఇంటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే కూతురికి అబ్బాయిని చూసేటప్పుడు ఆ అబ్బాయికి సంబంధించి ఐదు ప్రశ్నలు సమాధానాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తమ కూతురి భవిష్యత్తు సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. లేకుంటే తర్వాతి రోజుల్లో పశ్చాత్తాప పడాల్సి రావచ్చు. కాబట్టి ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు తమకు కాబోయే అల్లుడిని అడగాల్సిన ఐదు ప్రశ్నలు ఏంటో తెలుసుకోండి.
భవిష్యత్తు ప్రణాళికలు
కాబోయే అల్లుడిని భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో అడిగి తెలుసుకోండి. అతని ఆశయం ఏంటి? ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నాడు? ఏ స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాడో అడగండి. అతని కెరీర్, ఆర్థిక స్థిరత్వం, జీవిత లక్ష్యాల గురించి అడిగి తెలుసుకోండి. అలాగే మీ కూతురుకి నచ్చినట్టు ఉంటాడో ఉండడం కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ అమ్మాయికి అతడు స్థిరమైన జీవితాన్ని అందించగలడో లేదో అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న ఎంతో ఉపయోగపడుతుంది.
కుటుంబం గురించి అభిప్రాయం
వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కాదు, రెండు కుటుంబాలు కలిసి మన కూడా సాగించడం. కాబట్టి అతడు కుటుంబ బాధ్యతల విషయంలో ఎలా ఉంటాడో తెలుసుకోండి. కుటుంబం అంటే ఏమిటో అతడిని అడిగి చూడండి. అలాగే భవిష్యత్తులో ఎంతమంది పిల్లలు కావాలి? పిల్లల విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా తెలుసుకోండి. దాన్నిబట్టి అతడు కుటుంబ జీవితానికి విలువిస్తాడో లేదో తెలిసిపోతుంది. కొంతమంది పిల్లలను అడ్డుగా భావిస్తారు. కేవలం ఒకరు ఉన్నా చాలు అనుకుంటారు. పిల్లల్ని బరువుగా భావించేవారు భార్యను కూడా చక్కగా చూసుకుంటారని నమ్మకం ఉండదు.
ఎలాంటి అలవాట్లు ఉన్నాయో
కాబోయే అల్లుడు జీవనశైలి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అమ్మాయి తల్లిదండ్రులకు ఉంది. అతని రోజువారీ అలవాట్లు ఏంటి, ఎలాంటి ఆహారాన్ని తింటాడు. చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయో కూడా అడిగి తెలుసుకోండి. అలాగే అతడు మాట తీరును గమనించండి. మాట తీరును బట్టే గొడవలు పడే వ్యక్తిత్వం ఉన్నదా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ప్రతిదానికి హైపర్ గా సమాధానం ఇస్తూ ఉంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది.
భార్యకు ఇచ్చే స్థానం గురించి అడగండి
కొంతమంది భార్య అంటే ఇంట్లో పని చేసే వ్యక్తిగా, తమకు సేవలు చేసే మనిషిలా చూస్తారు. కాబట్టి పరస్పర అవగాహన భార్యకు ఇచ్చే గౌరవం గురించి కూడా అతడిని అడగండి. ఎందుకంటే ఒక వివాహం అనేది భార్యాభర్తల అవగాహన పైనా, ఒకరికి ఒకరు ఇచ్చుకునే గౌరవం పైనా ఆధారపడి సాగుతుంది. అలాగే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉండాలి. అలాగే నమ్మకం కూడా కలిగి ఉండాలి. కాబట్టి మీరు మీ అల్లుడి విషయంలో అతడు మహిళలకు ఎంతటి గౌరవాన్ని ఇస్తాడో, ఎలాంటి స్థానాన్ని ఇస్తాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
జీతం గురించి అడగండి
చాలామంది జీతం గురించి అడిగితే ఏమవుతుందో అని మొహమాటపడుతారు. కానీ ఖచ్చితంగా కాబోయే అల్లుడు జీతం, బ్యాంకు బ్యాలెన్స్ గురించి అడగండి. అలాగే పే స్లిప్పులు కూడా అడిగి తెలుసుకోండి. కొంతమంది తక్కువ జీతం వచ్చినా, ఎక్కువ జీతం వస్తున్నట్టు చెప్పి పెళ్లి చేసుకుంటారు. వివాహం తర్వాత ఆర్థిక ఇబ్బందులతో మీ అమ్మాయి పుట్టింటిపై ఆధార పడవలసి రావచ్చు. కాబట్టి ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అబ్బాయికి పొదుపు చేసే అలవాటు ఉందో లేదో దుబారాగా ఖర్చు చేసే వ్యక్తా అన్న విషయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.