కొన్ని దశాబ్దాల క్రితం గుండెజబ్బు రావాలంటే వృద్ధులకే వస్తుందని అపోహ ఉండేది. 50 ఏళ్లు దాటితే కానీ వారికి గుండెపోటు రాదని ధీమాగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 20,30, 40 ఏళ్లలో ఉన్న వారికి కూడా గుండెపోటు వచ్చే పరిస్థితులు, నిశ్చల జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా యువత గుండెపోటు బారిన పడుతోంది.
చిన్న వయసులోనే గుండె సమస్యలు బారిన పడడం అంటే జీవితాన్ని కోల్పోయినట్టే. అయితే 30లలో ఉన్నవారికి కొన్ని నిశ్శబ్ద లక్షణాలను గుండె చూపిస్తుంది. ఆ నిశ్శబ్ద లక్షణాలు గుండెపోటు వచ్చే అవకాశాన్ని ముందుగానే తెలియజేస్తాయి. చాలామంది ఛాతీ నొప్పి వస్తేనే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితేనే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. నిజానికి గుండెపోటు వచ్చే అవకాశాన్ని అనేక నిశ్శబ్ద హెచ్చరికల రూపంలో గుండె మనకు తెలియజేస్తుంది.
తగ్గని అలసట
రోజంతా పనిచేసిన తర్వాత అలసిపోవడం సహజం. తగినంత విశ్రాంతి తీసుకున్నాక అలసటగా అనిపించదు. కానీ వారాల తరబడి విశ్రాంతి తీసుకుంటున్నా, ఆహారం పుష్కలంగా తీసుకున్నా కూడా శరీరం అధిక అలసటగా అనిపిస్తూ ఉంటే మీ గుండె సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అంటే గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపు చేయలేకపోవడం వల్లే ఈ అలసట వస్తుందని అర్థం చేసుకోవాలి. గుండె సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరం అంతటా ఉన్న అవయవాలకు, కండరాలకు, కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీనివల్లే తీవ్రమైన అలసట కలుగుతుంది. ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. నిశ్శబ్ద గుండె సమస్యలు ఉన్నవారు తీవ్ర అలసట బారిన పడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఇలాగే అనిపిస్తే ఒకసారి వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అజీర్ణ సమస్యలు
గుండె సమస్యలు ఉన్న వారిలో అజీర్ణం, వికారం వంటి తేలికపాటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీరికి పొట్ట అసౌకర్యంగా అనిపిస్తుంది. గుండెలో రక్తప్రసరణ తగ్గడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఎంతోమందికి ఈ విషయం పై అవగాహన లేదు. జీర్ణ సమస్యలు వస్తే అది గుండె సంబంధిత సమస్యగా వారు భావించరు. 30లలో ఉన్నవారికి తరచూ పొట్ట సమస్యలు, జీర్ణ సమస్యలు, అజీర్తి వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఆ భాగాల్లో నొప్పి
గుండె జబ్బులు, ఛాతీ దగ్గర మాత్రమే నొప్పిని కలిగించవు. శరీరంలోని కొన్ని చోట్ల కూడా తేలికపాటి నొప్పిని కలిగిస్తాయి. ముఖ్యంగా దవడ, మెడ, భుజాల ప్రాంతంలో ఈ నొప్పి కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో బిగుతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కండరాల ఒత్తిడి, సరైన భంగిమలో పడుకోకపోవడం వల్ల ఇవి కలుగుతున్నాయని ఎంతోమంది అనుకుంటారు. ఇది గుండె సమస్య లక్షణాలు కూడా నిశ్శబ్ద గుండెపోటుగా వచ్చే అవకాశం ఉందని ఈ లక్షణాలు చెబుతాయి.
చిన్న పనులే చేయలేకపోవడం
తక్కువ దూరాలు నడవడం, మెట్లు ఎక్కడం వంటివి కూడా చేయలేక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలి. గుండెజబ్బులు, గుండె సమస్యలు ఉన్నవారికి చిన్న పని చేసినా కూడా తీవ్రమైన అలసట వస్తుంది. శ్వాస అందక ఇబ్బంది పడతారు. ఇది గుండె రక్తాన్ని పంపించే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి సాధారణ పనులు, తేలికపాటి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
తల తిరగడం
వ్యాయామం చేసేటప్పుడు వేగంగా నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా, మూర్ఛ వస్తున్నా, స్పృహ కోల్పోతున్నా గుండె సమస్య ఉందేమోనని అనుమానించాలి. ఈ సమయంలో గుండె మీ మెదడుకు తగినంత రక్తాన్ని సరఫరా చేయలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సక్రమంగా లేని హృదయ స్పందనలు, మూసుకుపోయిన రక్తనాళాలు గుండె జబ్బులకు కారణం అవుతాయి.
కాబట్టి 30 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నా కూడా ముందుగానే జాగ్రత్తపడాలి. పొగ తాగడం మానేయాలి.