ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఏటా 7,27,000 మంది తమ ప్రాణాలను తానే తీసుకుంటున్నారు. మరి కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసి అదృష్టవశాత్తు బతికిబట్ట కడుతున్నారు. 2021లో 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య గల వారిలో మరణానికి ఆత్మహత్యే మూడవ ప్రధాన కారణంగా నిలిచింది.
2000వ సంవత్సరం నుండి ఇప్పటికి పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య రేట్లు చాలా తగ్గాయి. 35 శాతం వరకు ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య తగ్గింది. అయితే అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో ఆత్మహత్యలు 17 శాతం పెరిగింది. అధిక ఆదాయ దేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం. ఎందుకంటే వారే ఒత్తిడి కారణంగా డిప్రెషన్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మద్యం అధికంగా తీసుకుని అనేక జబ్బులు బారిన పడి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా డిప్రెషన్, తీవ్రమైన ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు?
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకు ఒంటరితనం కూడా ముఖ్య కారణం. లేదా తీవ్రంగా వ్యాపారంలోను, జీవితంలోను నష్టపోవడం, కుటుంబ కలహాలు, శారీరకంగా జరుగుతున్న హింస వంటివి కూడా ఆత్మహత్యా ఆలోచనలతో ముడిపడి ఉంటున్నాయి. ముఖ్యంగా శరణార్థులు, వలసదారులు, లెస్బియన్లు, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్లు వంటి వారు ఆత్మహత్యలు అధికంగా చేసుకుంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరిస్తుంది.
ఆత్యహత్యల్లో ఈ దేశమే టాప్
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఆత్మహత్యలు అధికంగా చేసుకుంటున్న దేశం లిసోతో. ఇక్కడ ఆత్మహత్యల రేటు 36.7 శాతంగా ఉంది. ఇది దక్షిణాఫ్రికాకు చెందిన దేశం. ఈ దేశంలోని ప్రజలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లతో జీవిస్తున్నారు.
ఇక రెండో స్థానంలో ఈశ్వతిని అనే దేశం ఉంది. ఈ దేశంలో ఆత్మహత్య రేటు 31.8 శాతంగా ఉంది. ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం ఈ దేశంలో 12 లక్షల మంది జనాభాకు ఒకే ఒక మానసిక వైద్యుడు ఉన్నాడు. దీని వల్లే అక్కడ మానసిక సమస్యలు విపరీతంగా పెరిగిపోయి ఆత్మహత్యల అధికంగా చేసుకుంటున్నారు. ఈ దేశం కూడా దక్షిణాఫ్రికాకు చెందిన దేశమే.
ఇక మూడో స్థానంలో గయానా ఉంది. దక్షిణ అమెరికాలో ఉన్న గయానాలో ఆత్మహత్య రేటు 26.3 శాతంగా ఉంది. గయానాలో 826,000 మంది నివసిస్తూ ఉంటే కేవలం 16 మంది మానసిక వైద్యులు మాత్రమే ఉన్నారు.
నాలుగో స్థానంలో జింబాబ్వే దేశం నిలిచింది. ఈ దేశం తన ఆరోగ్య సంరక్షణ బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తోంది. కోటిన్నర జనాభాకు 18 మంది మానసిక వైద్యులు కూడా అక్కడ లేరు.
జింబాబ్వే తర్వాత సోలమన్ దీవులు 22.5 ఆత్మహత్య రేటుతో అయిదవ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువ.
ఆరో స్థానంలో సురినామ్ అనే చిన్న దేశం ఉంది. ఇది దక్షిణ అమెరికాలోని దేశం. మానసిక ఆరోగ్యం, అనారోగ్యాలతో బాధపడే ప్రజలు ఇక్కడ అధికంగానే ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో ఉరుగ్వే, దక్షిణాఫ్రికా, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, దక్షిణ కొరియా నిలిచాయి.
దక్షిణ కొరియాలోనూ
గాజులాంటి చర్మంతో అందంగా కనిపించే దక్షిణ కొరియా ప్రజల్లో కూడా ఆత్మహత్య రేటు అధికంగానే ఉంది. మిగిలిన ఆసియా దేశాలతో పోలిస్తే దక్షిణ కొరియాలో ప్రతి లక్ష మందిలో 20 మందికి పైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడ ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ మానసిక ఆరోగ్యం ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.