రోటీ లేదా చపాతి ప్రతిరోజు తినే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా రాత్రిపూట చపాతీని తినేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారని ఎంతోమంది అభిప్రాయం. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు చపాతి అనేకసార్లు తినేవారు కూడా ఉన్నారు. అయితే చపాతీని గోధుమపిండితో చేయడం వల్ల పూర్తిగా ప్రోటీన్ అందదు. కాబట్టి మీరు ఇంట్లో తినే రోటీ, చపాతీని ప్రోటీన్ రిచ్ గా మార్చేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అలా చేశారంటే మీకు బలం, శక్తి కూడా అందుతుంది. అలాగే చపాతి తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా.
మనకు ప్రోటీన్ ఎందుకు?
చపాతీని నేరుగా తినకుండా ప్రోటీన్ నిండుగా ఉండేలా ఎందుకు చేసుకోవాలి? మనకి ప్రోటీన్ ఎందుకు అంత అవసరం అనే సందేహం ఎక్కువ మందిలో రావచ్చు. ప్రోటీన్ అనేది శరీరాన్ని నిర్మించేందుకు, కణాలను మరమ్మత్తు చేసేందుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన పోషకం. శరీరం సజావుగా పనిచేయాలన్నా, ఎంజైమ్ లు ఉత్పత్తి జరగాలన్నా ప్రోటీన్ పుష్కలంగా ఉండాలి. కండరాల బలానికి కూడా ప్రోటీన్ అవసరం. బరువును పెరగకుండా అడ్డుకోవడంలో కూడా ప్రోటీన్ ముందుంటుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూసేది కూడా ప్రోటీన్. కాబట్టి మీరు చపాతీని, రోటిని ప్రోటీన్ రిచ్ ఆహారంగా మార్చుకునేందుకు చిన్న చిట్కాలు ఉన్నాయి. ఇలా చేశారంటే మీరు తిన్న రోటి, చపాతి ఎంతో ఆరోగ్యకరమైనదిగా మారిపోతుంది.
శెనగపిండిని కలిపి
మీరు చపాతి, రోటి చేసేటప్పుడు రెగ్యులర్ గా గోధుమ పిండిని వాడతారు. అలా గోధుమపిండిని వాడినప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండిని కూడా వేసి కలపండి. శనగపిండి అనేది మొక్కల ఆధారిత ప్రోటీన్ నిండిన పదార్థం. ఇది రోటిని మెత్తగా వచ్చేలా చేస్తుంది. అంతేకాదు ప్రోటీన్ ని కూడా అందిస్తుంది. శెనగపిండి లో తక్కువ గ్లైసెమక్ సూచిక కూడా ఉంటుంది. అంటే దీనిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా శెనగపిండి ఉపయోగపడుతుంది. గుండె పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.
సత్తు పిండి
శెనగపిండి లాగే సత్తుపిండిని కూడా గోధుమ పిండిలో కలిపి చపాతీ, రోటీలు చేయవచ్చు. దీనిలో కూడా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మృదువైన ప్రోటీన్ నిండిన చపాతీలు, రోటీలు చేసేందుకు సత్తుపిండిని వాడండి. ఇందుకోసం సగం గోధుమపిండిని, సగం సత్తుపిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ సత్తుపిండిలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్, ఐరన్, మెగ్నీషియం కూడా నిండుగా ఉంటాయి. ఇలా సత్తుపిండి, గోధుమపిండి కలిపి చపాతీలు, రోటిలు తినేందుకు కూడా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టడం చాలా ముఖ్యం.
సోయా పిండి కలిపి
ఎప్పుడు సాదా రోటీని తినడం వల్ల శరీరానికి వచ్చే లాభమేమీ లేదు. అప్పుడప్పుడు సోయా పిండిని కూడా అందులో వేసి చేసేందుకు ప్రయత్నించండి. లేదా సోయా గ్రాన్యూల్స్ తీసుకొని నీటిలో బాగా నానబెట్టి చపాతీ పిండిలో వేసి కలపండి. 100 గ్రాముల సోయా గ్రాన్యుల్స్ కలపడం వల్ల మీకు 50 గ్రాములకు పైగా ప్రోటీన్ లభిస్తుంది. అలాగే డైటరీ ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్సరస్ కూడా ఇందులో అధికంగా ఉంటాయి. అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
పనీర్
పనీర్ ను కూడా రోటి, చపాతీలతో కలిపి చేయవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. గోధుమపిండిని కలుపుతున్నప్పుడే పనీర తురుమును అందులో వేసి బాగా కలిపి రోటీలాగా ఒత్తుకోండి. లేదా చపాతీని ఒత్తుతున్నప్పుడు మధ్యలో పనీర్ తురుమును వేసి మడతపెట్టి మళ్ళీ రోటీలాగా ఒత్తుకొని రెండు వైపులా కాల్చుకోండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ నిండి ఉంటుంది. 100 గ్రాముల పనీరులో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే టోఫు తీసుకుంటే ఎనిమిది నుంచి 10 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. టోఫు అంటే సోయాతో చేసే పనీర్.