టమాటా ధరలు తగ్గాయి. చలికాలంలోనే టమోటాలు తక్కువ ధరకు లభిస్తాయి. ఎండాకాలం వచ్చిందంటే వాటి ధరలు కొండెక్కిపోతాయి. కాబట్టి ఓపికగా ఈ సమయంలోనే టమోటో నిల్వ పచ్చడి పెట్టుకునేందుకు ప్రయత్నించండి. ఒకసారి చేసుకుంటే నెలరోజుల పాటూ ఈ నిల్వ పచ్చడి ఉంటుంది. స్పైసీగా చేసుకుంటే దీని రుచి మామూలుగా ఉండదు. ఒకసారి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
టమోటో నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు
టమాటాలు – ఒక కిలో
నూనె – ఒక కప్పు
ఎండుమిర్చి – ఐదు
కారం – నాలుగు స్పూన్లు
ఉప్పు – రెండు స్పూన్లు
ఆవాలు – ఒక స్పూను
ఇంగువ – అర స్పూను
మెంతిపొడి – అర స్పూను
పసుపు – అర స్పూను
టమోటో నిల్వ పచ్చడి రెసిపీ
⦿ టమోటాలను పరిశుభ్రంగా కడిగి తడి తుడిచి గాలికి ఆరబెట్టాలి. తడి లేకుండా చూసుకోవాలి.
⦿ వాటిని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో టమాటాలను వేసి వేయించాలి. మూత పెట్టకూడదు.
⦿ ఈ టమాటాలు మగ్గడానికి 20 నిమిషాలు పడుతుంది.
⦿ ముక్క పూర్తిగా మెత్తగా మారి టమో టో మిశ్రమంలాగా అవుతుంది.
⦿ అప్పుడు ఉప్పు, కారం, పసుపు, మెంతుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఈ మొత్తం మిశ్రమాన్ని వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
⦿ ఈ మొత్తం మిశ్రమం చల్లారాక చిన్న కళాయి ఈ స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఇంగువను చల్లాలి.
⦿ ఇప్పుడు ఈ పోపుని టమాటా పచ్చడి మీద వేసుకోవాలి. అంతే టేస్టీ టమాటో నిల్వ పచ్చడి రెడీ అయినట్టే.
⦿ ఇది నెలరోజులు దాకా ఉంటుంది. ఈ నిల్వ పచ్చడికి టమాటోలను ఎండ పెట్టాల్సిన అవసరం లేదు. రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి.
Also Read: అన్నం మిగిలిపోతే పడేయకుండా ఇలా దోశలు వేసేయండి, రెసిపీ ఇదిగో
టమోటాలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు. ప్రతిరోజు టమోటోలు తినేవారికి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. టమోటోల్లో ఉండే లైకోపీన్ ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించి కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటుంది. టమోటోలు పేదవాడి ఆహారంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టమోటో ధరలు చాలా వరకు తగ్గిపోయాయి. ఎండాకాలం వస్తే వీటి ధరలు పెరిగిపోవచ్చు. కాబట్టి టమోటో ధరలు తక్కువగా ఉన్నప్పుడే వాటితో టేస్టీ వంటకాలను ప్రయత్నించండి. ఇక్కడ మేము చెప్పిన టమోటో పచ్చడి నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. టమోటాల్లో ఉండే లైకోపీన్ అనేది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదించేలా చేస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా చెప్పాయి. అలాగే టమాటోల్లో విటమిన్ కే, క్యాల్షియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలతో సహా కణజాలాన్ని కూడా బలోపేతం చేయడానికి సహకరిస్తాయి. అలాగే టమోటోలలో విటమిన్ బి, పొటాషియం కూడా ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించేందుకు సహాయపడతాయి. హైబీపీతో బాధపడేవారు, టమోటోలను ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా టమోటోలు ముందుంటాయి.