ఉత్తర భారతదేశంలో పరాటాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా పరాటా ప్రియులు పెరిగిపోయారు. ఎప్పుడూ ఒకే రకమైన పరాటాలు తింటే ఎలా? ఆరోగ్యాన్ని ఇచ్చే టమాటా పరాటా ఒకసారి చేసుకుని చూడండి. దీన్ని చేసేందుకు నూనె ఎక్కువ అవసరం లేదు. కాబట్టి మీకు డబుల్ హెల్త్ వస్తుంది. ఇక టమాటా పరాటా చేయడానికి ఏమేం కావాలో.. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
టమాటా పరాటా రెసిపీకి కావలసిన పదార్థాలు
టమోటోలు – రెండు
గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు
పచ్చిమిర్చి – రెండు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
సోంపు – అర స్పూను
వాము – పావు స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – సరిపడినంత
నెయ్యి – రెండు స్పూన్లు
టమోటో పరాటా తయారీ
1. మిక్సీలో టమోటోలను ముక్కలుగా కోసి వేయండి.
2. అందులోనే పచ్చిమిర్చిని, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, సోంపు వేసి మెత్తగా రుబ్బుకోండి.
3. దీనికి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. టమాటాలలోని తడి సరిపోతుంది.
4. ఇప్పుడు టమోటో పేస్టును తీసి ఒక గిన్నెలో వేయండి.
5. అందులో కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వాము వేసి బాగా కలపండి.
6. ఇప్పుడు అదే టమోటో మిశ్రమంలో ఒకటిన్నర కప్పు గోధుమపిండిని వేసి బాగా కలపండి.
7. ఒక టీ స్పూన్ నూనె కూడా వేయండి. అవసరం అనిపిస్తే నీళ్లను కూడా వేయండి.
8. ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకొని పైన తడి గుడ్డ కప్పి పది నిమిషాలు వదిలేయండి.
9. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. ఇప్పుడు పిండి లోంచి కొంత ముద్దను తీసి చేతులు పరాటాలాగా వత్తుకోండి.
10. పరాటాను రెండు వైపులా కాల్చుకోండి. కాస్త నెయ్యిని వేసి ఒత్తండి.
11. అంతే మెత్తటి టమాటా పరాటాలు రెడీ అయిపోతాయి. వీటిని చూస్తేనే నోరూరిపోతుంది.
ఈ టమాటా పరాటాలు తినేందుకు పక్కన కర్రీ లేకపోయినా పరవాలేదు. ఉత్తినే తినాలనిపించేలా ఉంటాయి. లేదా పెరుగుతో తింటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. కావాలనుకుంటే చికెన్ గ్రేవీ, ఎగ్ కీమా వంటి వాటితో కూడా తినవచ్చు. ఎలా తిన్నా దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం… ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో టమాటా పరాటా చేసేందుకు ప్రయత్నించండి. దీని రుచికి మీరు దాసోహం అయిపోతారు.