ఉదయం లేస్తూనే కాఫీ కప్పు కోసం చేతులు చాచేవారు ఎంతోమంది. అలాంటివారు కాఫీలో అర స్పూను నెయ్యి కలుపుకుని తాగి చూడండి. ఇది సాంప్రదాయమైన ఆయుర్వేద పానీయంగా చెప్పుకుంటారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికమే. కాఫీ, నెయ్యి లేదా కొబ్బరి నూనె కాంబినేషన్ అనేది మన శరీరంలో ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
నెయ్యితో ఉపయోగాలు
నెయ్యిలో కొవ్వులు కరిగే విటమిన్లు ఉంటాయి. అలాగే లినోలెయిక్ ఆమ్లం నెయ్యిలో ఉంటుంది. ఈ రెండూ కూడా బరువు తగ్గడానికి మెరుగైన జీర్ణ క్రియకు సహాయపడతాయి. కాబట్టి కాఫీలో ప్రతిరోజు ఒక స్పూను నెయ్యిని మరిగించి వేసి బాగా కలుపుకొని తాగండి. కొన్ని రోజుల్లోనే మీలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ నెయ్యి కాఫీని తాగడం వల్ల ఎలాంటి మార్పులు మీలో కనిపిస్తాయో తెలుసుకోండి.
బరువు తగ్గడం
నెయ్యి కాఫీని ప్రతిరోజు తాగడం వల్ల జీవక్రియ మెరుగ్గా జరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. నెయ్యిలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ శరీరం త్వరగా శోషించుకుంటుంది. దీనివల్ల శక్తి కూడా త్వరగా అందుతుంది.
జీర్ణక్రియ
నెయ్యిలో బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శాంతపరుస్తుంది. అలాగే పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెరుగైన జీర్ణక్రియకు ఇన్ఫ్మమేషన్ తగ్గడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఇది ఉపయోగపడుతుంది.
శక్తి పెరగడం
నెయ్యి కాఫీలో కెఫిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలుస్తాయి. దీనివల్ల స్థిరంగా శక్తి అందుతూ ఉంటుంది. మానసిక స్పష్టత కూడా పెరుగుతుంది. ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
శోథ నిరోధక లక్షణాలు
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, శోధ నిరోధక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను చాలా వరకు తగ్గిస్తా.యి అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
మానసిక ఆరోగ్యం
నెయ్యి కాఫీని ప్రతిరోజూ తినే వారిలో మానసిక స్పష్టత అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాఫీలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
నెయ్యి కాఫీని తాగేటప్పుడు ఎక్కువగా నెయ్యిని కలపకూడదు. ఎందుకంటే నెయ్యిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితంగా అర స్పూనుకు మించి కలపకపోవడమే మంచిది. అలాగే పాలు పడని వారిలో కూడా నెయ్యి పడకపోవచ్చు. కాబట్టి పాల ఉత్పత్తులు అలెర్జీ మీకు ఉంటే ఈ నెయ్యి కాఫీని తాగడం మానేయాలి.