పామును చూస్తేనే భయం వేస్తుంది. ఒక్క పాము కనిపిస్తేనే దాన్ని వెతికి వెతికి చంపే వరకు ప్రశాంతంగా నిద్రపోలేరు. ఎప్పుడు వచ్చి కాటేస్తుందో అని భయపడతారు. అలాంటిది ఒక ప్రాంతంలో ప్రతి చదరపు అడుగుకు ఒక పాము ఉన్న ప్రాంతం ఉంది. దీన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. బ్రెజిల్ లోని సావో పాల్ సముద్ర తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఈ స్నేక్ ఐలాండ్ దీవి ఉంది. ఇది దాదాపు 106 ఎకరాలలో విస్తరించి ఉంది.
మొత్తం ఎన్ని పాములు?
ఈ స్నేక్ ఐలాండ్ లో దాదాపు నాలుగు వేల పాములు నివసిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే ఒక్కో చదరపు మీటరుకు కచ్చితంగా ఒక పాము కనిపించే అవకాశం ఉంది. అది కూడా ఎంతో విషపూరితమైనవి.
ప్రవేశంపై నిషేధం
స్నేక్ ఐలాండ్ లో మాత్రమే కనిపించే పాములు గోల్డ్ లోన్స్ హెడ్ జాతికి చెందినవి. ఇవి మిగతా పాములతో పోలిస్తే ఐదు రెట్లు బలమైన విషాన్ని కలిగి ఉంటాయి. అందుకే 1920లోనే బ్రెజిల్ ప్రభుత్వం ఈ ఐలాండ్ కు ఎవరు వెళ్ళకూడదని నిషేధం విధించింది. ఆఖరికి నేవీ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లేందుకు భయపడతారు. కానీ అక్కడ ఉన్న లైట్ హౌస్ కు అప్పుడప్పుడు నేవీ సిబ్బంది అవసరం పడతారు. ఆ సమయంలో తమతో పాటు ఒక వైద్యుడిని పాముల విషయానికి యాంటీ డోట్‌ను కూడా తీసుకువెళ్తారు
ఈ స్నేక్ ఐలాండ్ ఎలా ఏర్పడిందో చెప్పుకునేందుకు ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు 11వేల సంవత్సరాల క్రితం ఈ స్నేక్ ఐలాండ్ ఏర్పడిందని చెబుతారు. కానీ అక్కడ మనుషులు జీవించే అవకాశం లేకుండా పోయింది. కేవలం పాములు మాత్రమే జీవించసాగాయి. ఈ పాములు ఎంత ప్రమాదకరమైనవంటే ఒక్కసారి కాటేస్తే మెదడులో రక్తస్రావం జరుగుతుంది. మూత్రపిండాలు విఫలమవుతాయి. మరణాల రేటు కూడా అధికమే. అందుకే ఒక్కరు కూడా ఆ ద్వీపానికి వెళ్లకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
కానీ కొంతమంది స్మగ్లర్లు మాత్రం ఇక్కడ పాముల కోసం వెళుతూ ఉంటారు. అలాగే ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఒకప్పుడు అక్కడ ఉన్న లైట్ హౌస్ కు ఒక కీపర్ ఉండేవారని, అతని కుటుంబం కూడా జీవించేదని చెప్పుకుంటారు. కానీ ఈ పాముల వల్ల ఆ కుటుంబం మొత్తం మరణించిందని కూడా అంటారు. కానీ స్మగ్లర్లు మాత్రం తెలివిగా అక్కడి పాములను పట్టి బయట దేశాలకు అమ్మేస్తున్నారు. ఏడాదికి పాతిక పాముల నుంచి 40 పాములను దొంగిలించి అక్కడ నుంచి తీసుకువెళుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆ పాములు అలా అంతరించిపోయే అవకాశం కనిపిస్తోంది.
సాధారణ ప్రజలు ఎప్పటికీ ఈ స్నేక్ ఐలాండ్ ని సందర్శించలేరు. కానీ నేవీ అలాగే శాస్త్రవేత్తలు మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో ఒక్కొక్కసారి ఆ ఐలాండ్ లో అడుగు పెడుతూ ఉంటారు.