ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన తొక్కసలాటలో ఏడుగురు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ‘పుష్ప 2’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారంతా తిరుపతిలోని పలు ఆస్పత్రులలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై ఏపీ సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు దిగింది.
ఇంతకీ తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది?
తొక్కిసలాట అనేది ఒక ప్రదేశంలో సామర్థ్యానికి మించి జనాలు చేరుకోవడం వల్ల జరుగుతుంది. తొక్కిసలాట సమయంలో ప్రజలు ఒకరి మీద మరొకరు పడిపోతారు. తమ ప్రాణాలను కాపాడుకోవాలనే కంగారులో కిందపడినవారిని తొక్కేస్తూ పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తారు. దాని వల్ల కింద పడ్డ వ్యక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోతారు. మరికొందరు గాయాలతో బయటపడతారు. కానీ, వారికి కూడా తక్షణ వైద్యం అవసరం అవుతుంది.
తొక్కిసలాటకు ముఖ్యమైన కారణాలు
⦿ మోతాదుకు మించి జనాలు ఒక్కచోట చేరడం
⦿ జన సమూహాన్ని కంట్రోల్ చేయలేకపోవడం
⦿ ఆయా ఈవెంట్లకు సరైన ప్లాన్ లేకపోవడం
⦿ ఇరుకైన ప్రదేశాల్లో ఈవెంట్లు నిర్వహించడం
⦿ త్వరగా వెళ్లాలనే కంగారుతో ఒకరినొకరు తోసుకోవడం
తొక్కిసలాట సమయంలో ఏం జరుగుతుంది?
తొక్కిసలాట జరిగినప్పుడు పలువురు కింద పడిపోతారు. వారిని తొక్కుకుంటూ జనాలు అటు ఇటూ వెళ్తుంటారు. ఆ సమయంలో కిందపడిన వారి ఊపిరితిత్తులతో పాటు గుండె మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది. అటు ఇటు కదిలే పరిస్థితి ఉండదు. శ్వాస సరిగా అందదు. ఛాతిమీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు లంగ్స్ (ఊపిరితిత్తులు) మీద ప్రెజర్ పడి ఊపిరి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. శ్వాసక్రియకు ఉపయోగపడే ప్రధాన కండరమైన డయా ఫ్రాగమ్ పనితీరు ఆగిపోతుంది. గాలి ఊపిరితిత్తులలోకి వెళ్లదు, బయటకు రాదు. ఇలాంటి సమయంలో శరీరంలో కార్బన్ డయాక్సైడ్ అలాగే ఉండిపోవడం, ఆక్సిజన్ లేకపోవడం వల్ల కంప్రెసివ్ అస్ఫిక్సియా(Compressive Asphyxia)కు దారితీస్తుంది. మానవ శరీరం ఆక్సిజన్ లేకుండా ఎక్కువ సేపు పని చేయలేదు. త్వరగా ఆర్గాన్ ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. దానివల్ల కొందరు అపస్మారక స్థితికి చేరుకుంటారు. మరికొంత మంది బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది.
కంప్రెసివ్ అస్ఫిక్సియా ఉన్నవారిని ఎలా కాపాడాలి?
నిజానికి కంప్రెసివ్ అస్ఫిక్సియా అనేది చాలా ప్రమాదకరమైనది. కానీ, ప్రతిసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ కంప్రెసివ్ అస్ఫిక్సియా, కార్డియాక్ అరెస్ట్ అయిన బాధితులు నాలుగు నిమిషాల తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రవాహం జరిగేలా CPR చేయడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
CPR ఎలా చేయాలంటే?
⦿ అపస్మారక స్థితిలోకి చేరిన వ్యక్తిని మీ మోకాలి మీదకి తీసుకోవాలి.
⦿ మీ రెండు చేతి వేళ్లను జోడించాలి. ఛాతి భాగంలోని రొమ్ము ఎముకకు దిగువ భాగంలో ఉంచాలి.
⦿ సుమారు నాలుగు సెంటీ మీటర్ల లోపలికి చేతులు వెళ్లేలా ప్రెస్ చేయాలి.
⦿ నిమిషానికి 100 నుండి 120 సార్లు CPR చేయాలి.
⦿ రెండు సార్లు నోటి ద్వారా శ్వాసను ఇచ్చేందుకు ప్రయత్నించాలి.
ఎక్కువ జన సమూహం ఉన్నప్పుడు ఏం చేయాలి?
⦿ ఇరుకు ప్రదేశాల్లో జరిగే కచేరీలు, సమావేశాలు, భక్తి సంబంధ కార్యక్రమాలకు వెళ్లే సమయంలో అనుకోని ఘటనలు జరిగినా సేఫ్ గా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿ ఎక్కువ మంది జనాలు పోగయ్యే కార్యక్రమాలు ఒంటరిగా వెళ్లకూడదు. స్నేహితులు లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి.
⦿ ఎక్కువ మంది తరలి వచ్చే ఈవెంట్ లో ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. దానివల్ల అత్యవసర సమయాల్లో మిమ్మల్ని గుర్తు పట్టే అవకాశం ఉంటుంది.
⦿ అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేందుకు దారులు ఎక్కడ ఉన్నాయో ముందుగానే చూసుకోవాలి. ఒకవేళ తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నట్లు గ్రహిస్తే అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలి.
⦿ తొక్కిసలాట సరిగే సమయంలో రెయిలింగ్ లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
తొక్కిసలాట సమయంలో పడిపోతే ఇలా చేయండి!
⦿ తల, మెడకు దెబ్బ తలకుండా చూసుకోండి. వెల్లకిల కాకుండా నేలవైపు ముఖం ఉండేలా వంగి ఉండాలి.
⦿ వీలైనంత వరకు తిరిగి లేవడానికి ప్రయత్నించండి. అవసరం అయితే, లేచి ఉన్న వారి సాయం తీసుకోండి.
⦿ జన సమూహంలో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
⦿ గుంపులో నలిగిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿ ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లు మూయకూడదు.
⦿ వీలైనంత వరకు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి.
⦿ శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
⦿ తొక్కిసలాటలో బోర్లా పడినా ఛాతి భూమికి తగలకుండా చేతులతో కాపాడుకోవాలి.
⦿ వెనుకనుంచి బలవంతంగా ఎవరైనా నెట్టినా ముందుకు వెళ్లాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పడిపోకుండా జాగ్రత్త పడాలి.
⦿ వీలైనంత వరకు జన సమూహంలో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
Read Also: పంచదార శాకాహారమా? మాంసాహారమా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!