Wheatgrass juice: మన ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం, జీవనశైలి, అలవాట్లు అన్నీ సమతుల్యం కావాలి. కానీ ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో పౌష్టిక విలువలు తగ్గిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన శరీరానికి కావాల్సిన శక్తి, రక్తం, రోగనిరోధక శక్తి అందించగల సహజమైన మార్గం గోధుమ గడ్డి జ్యూస్. అవును మీరు విన్నది నిజమే. గడ్డితో ఆరోగ్యమా? అని ప్రశ్న కూడా రావొచ్చు. కానీ గోధుమ గడ్డి మానవ శరీరానికి సహజ ఔషధం అంటారు.
గోధుమ గడ్డి అనేది గోధుమ గింజలను మొలకెత్తించి వచ్చే ఆకులు. వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు వస్తాయి. దీనిని “గ్రీన్ బ్లడ్” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని వల్ల మన శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి.
రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ గోధుమ గడ్డి రసం తాగితే, శరీరానికి అవసరమైన శక్తి సహజంగానే లభిస్తుంది. రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలసట తగ్గిపోతుంది. గోధుమ గడ్డిలో విటమిన్ A, C, E, ఐరన్, మ్యాగ్నీషియం, కాల్షియం, అమినో ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ జలుబు, దగ్గు, అలసట, బలహీనతతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
Also Read: Navratri festival: నవరాత్రిని సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటామా! ఎందుకు?
ఇక షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా గోధుమ గడ్డి జ్యూస్ చాలా సహాయపడుతుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గోధుమ గడ్డి రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే రక్తపోటు నియంత్రణలోనూ ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది.
గోధుమ గడ్డి రసం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు తగ్గుతాయి. కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచి, పేగుల పనితీరును బాగు చేస్తుంది. ఈ రసం చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముడతలు, మొటిమలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదల పెరుగుతుంది. గోధుమ గడ్డి రసం అంటే ప్రకృతి మనిషికి ఇచ్చిన ఒక వరం అని చెప్పాలి. రక్తం అధికంగా తయారవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు తగ్గిపోతాయి.