ప్రతిరోజూ తలస్నానం చేసేవారు ఎంతోమంది. కానీ వారికి ఎలాంటి జ్వరమూ రాదు. వర్షంలో ఒక్కసారి తడిసినా చాలు.. వెంటనే జ్వరం వచ్చేస్తుంది. స్నానం ఎక్కువ సేపు చేసినా కూడా ఫిట్ గా ఉండేవారు. ఒక్కసారి వర్షంలో తడిస్తేనే జ్వరం బారిన ఎందుకు పడతారు?
వాతావరణంలో ముఖ్యమైన మార్పును సూచించేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలోనే టైఫాయిడ్, డయేరియా, కామెర్లు వంటి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా పెరుగుతాయి. వర్షం ఏ సీజన్లోనైనా ఒక్కోసారి పడే అవకాశం ఉంది. కానీ వర్షాకాలంలో పడే వర్షం మాత్రం భిన్నంగా ఉంటుంది.
వర్షంలో తడిసిన తర్వాత చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. బలహీనమైన రోగనిరోథక శక్తి కలిగి ఉన్న వారికే ఎక్కువగా ఇలా దగ్గు, జ్వరం వస్తూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
వర్షంలో జ్వరం ఎందుకు?
వర్షంలో తడిస్తే జ్వరం రావడానికి ప్రధాన కారణం చలి. ఆ చలి వల్ల శరీర ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు చర్మం చల్లగా మారి శరీర ఉష్ణోగ్రతను కూడా తగ్గేలా చేస్తుంది. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందో.. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అప్పుడు సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించడానికి అవకాశాన్ని ఇస్తాయి.
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదలకు అవసరమైన వాతావరణంలో ఇస్తుంది. అందుకే సూక్ష్మక్రిములు నిండిన వర్షపు నీటిలో తడిసిన వారికి చర్మ, శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. లేదా జ్వరం కూడా రావచ్చు.
వర్షంలో తడవడం వల్లే జ్వరం రాదు. కానీ అది జ్వరం వచ్చే అవకాశాలను గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా ఎవరికైతే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటుందో, ఇతర ఆరోగ్య సమస్యలతో వారు ఇబ్బంది పడుతూ ఉంటారో… వారికే వర్షంలో తడవగానే జ్వరం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
తడిశాక వెంటనే ఇలా చేయండి
జ్వరం రాకుండా ఉండాలంటే వర్షంలో తడిసిన వెంటనే మీ దుస్తులను మార్చుకోవాలి. పొడి బట్టలను వేసుకోవాలి. శరీరాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. వెంటనే వెచ్చని పానీయాలను తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
వర్షంలో తడిసాక మీకు జ్వరం అధికంగా వస్తోందంటే మీరు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం చేసుకోండి. కాబట్టి రోగనిరోధక శక్తిని బలంగా మార్చుకునే ఆహారాలను మీ మెనూలో చేర్చుకోండి.