CM Singapore tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి జూలై 31 వరకు ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం అని తెలిపారు. అలాగే ‘బ్రాండ్ ఏపీ’ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యం కూడా కలిగి ఉందన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు.
పర్యటన షెడ్యూల్, లక్ష్యాలు..
జూలై 27న సింగపూర్‌లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్‌లో ప్రవాసాంధ్రులతో సమావేశం. ఈ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు. అలాగే సింగపూర్‌లోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో భేటీల ద్వారా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, విద్య, హెల్త్‌కేర్, టూరిజం, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత ప్రాజెక్టులలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరుపుతామన్నారు.
అమరావతి అభివృద్ధి.. సింగపూర్ భాగస్వామ్యం..
గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సింగపూర్‌తో సంబంధాలను దెబ్బతీసినట్లు చంద్రబాబు విమర్శించారు. ఈ పర్యటన ద్వారా అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడానికి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాలను పునరుద్ధరించడం ఒక ముఖ్య లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 1053 కి.మీ. తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కనెక్టివిటీ వంటి అంశాలను విదేశీ పెట్టుబడిదారులకు హైలైట్ చేస్తామని తెలిపారు.
బ్రాండ్ ఏపీ
అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం, కొత్త పారిశ్రామిక విధానాలను.. విదేశీ సంస్థలకు వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని తెలిపారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కూడా ఈ పర్యటనలో భాగం. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ రంగాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, బిజినెస్ రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొననున్నారు.
Also Read: తిరుపతిలో ద్విచక్ర వాహన దారుడిపై చిరుత దాడి.. భయం గుప్పిట్లో భక్తులు
సింగపూర్‌లో ఐటీ, పోర్టుల అభివృద్ధి, మౌలిక వసతులు, నగర సౌందర్యీకరణ వంటి అంశాలను అధ్యయనం చేసి, వీటిని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే మంత్రి నారా లోకేష్ ఐటీ కంపెనీలతో సమావేశమై, విశాఖపట్నంలో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందని టీడీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.