చలికాలం కొంతమందికి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మరికొందరికి ముఖంలోనే ఎన్నో మార్పులు కలిగేలా చేస్తుంది. అందులో ముఖ్యమైనది ఎర్రటి ముక్కు. తెల్లగా ఉండే వారికి ఎర్రటి ముక్కు స్పష్టంగా కనిపిస్తుంది. చలికాలం వచ్చేసరికి ఇలా ముక్కు ఎందుకు ఎర్రగా మారుతుంది? అలాగే కొందరిలో చెంపలు కూడా ఎర్రగా మారుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ముక్కు బయట ఉష్ణోగ్రతలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది సహజ ప్రతిచర్య. బయట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు శరీరకణాలు, రక్తనాళాలు ఆ చల్లని వాతావరణం నుండి తమని తాము రక్షించుకోవడానికి ప్రతిస్పందిస్తాయి. ఇందులో భాగంగా ముక్కు దగ్గర ఉన్న రక్తనాళాలు విస్తరిస్తాయి. అందుకే ఆ భాగంలో ముక్కు ఎరుపు రంగులో లేదా గులాబీ రంగులో కనిపిస్తుంది. చలికాలంలో మాత్రమే ఇలా ముక్కు రంగును మార్చుకుంటుంది. అలా కాకుండా సాధారణంగా కూడా కొంతమందికి ముక్కు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
కొందరికి అలెర్జీలు, జలుబు, దగ్గు వల్ల కూడా ముక్కు రంగు మారుతుంది. చలికాలంలో అలెర్జీ సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. అలర్జీలు, జలుబుతో బాధపడుతున్నప్పుడు మీ ముక్కు ఉబ్బి ఎర్రగా మారుతుంది. అలాగే ఎక్కువగా తుమ్ములు వస్తున్నాయి. ముక్కును అధికంగా రుద్దుతున్న కూడా ముక్కు రంగు మారే అవకాశం ఉంది.
చలికాలంలో కొందరికి ముక్కు నుండి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. శీతాకాలంలో శరీరంలో నీటి కొరత కారణంగా ముక్కులో ఉన్న పొరలు ఎండిపోతాయి. దీనివల్ల ఆ ఎండిపోయిన పొరలు చిట్లిపోయి ముక్కునుండి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా ముక్కు ఎరుపు రంగులోకి మారే అవకాశం ఎక్కువే.
ముక్కు ఎర్రగా మారకుండా ఉండాలి అంటే చిన్న చిన్న చిట్కాలను పాటించండి
చలికాలంలో నీరు తక్కువగా తాగినా కూడా ముక్కు పొడిబారి పోయే సమస్య అధికమవుతుంది. దీని వల్ల ముక్కు దగ్గర విపరీతమైన మంట మొదలవుతుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగాల్సిన అవసరం కూడా ఉంది.
Also Read: స్మోకింగ్.. మానేయాలా? ఈ సింపుల్ ఫార్ములాను ప్రయత్నించండి, త్వరగా మానేస్తారు
ముక్కులోపల పొడిబారే సమస్యను తగ్గించాలి. పొడిబారకుండా ఉండాలంటే ముక్కులో కొబ్బరి నూనె, వాజెలిన్ వంటివి రాస్తూ ఉండాలి. జలుబు చేసినప్పుడు ముక్కును మెత్తటి వస్త్రంతో శుభ్రపరచాలి. తుమ్మేటప్పుడు ముక్కును గట్టిగా రుద్దడం వంటివి చేయకూడదు. లోపల ఇన్ఫెక్షన్ వాపు వంటివి ఉంటే ముక్కు ఎర్రగా మారిపోతుంది. చాలామంది చలికాలంలో హీటర్లను వాడుతూ ఉంటారు. రూమ్ హీటర్లు గాలిని పొడిగా మార్చేస్తాయి. దీనివల్ల కూడా ముక్కులో పొడితనం పెరిగిపోతుంది. దీనివల్ల చికాకు కలుగుతుంది. చలికాలంలో రూమ్ హీటర్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది.