చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటప్పుడు అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం గమనిస్తారు. పిల్లలు సోమరితనంతో లేదా అశ్రద్ధగా ఉన్నారని అనుకుంటారు. కానీ దీని వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యలను అర్థం చేసుకుంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. సంతోషంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటారు.
ప్రస్తుతం పిల్లలు.. ఎక్కువ అకడమిక్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మంచి మార్కులు, పర్ఫెక్ట్ పెర్ఫామెన్స్ అని ఆశించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో పోల్చడం కూడా సమస్యను మరింత పెంచుతుంది. ఫలితంగా చదువు శిక్షలాగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఫలితాల కంటే ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి.
తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గి మూడ్ బాగుండదు. పిల్లలు చిరాకుపడుతుంటారు. రాత్రి ఆలస్యంగా మొబైల్, ట్యాబ్ వాడటం వల్ల నిద్ర క్వాలిటీ తగ్గుతుంది. ఈ అలసట వల్ల మెదడు సరిగ్గా పని చేయదు. పిల్లలకు రోజూ స్థిరమైన నిద్రా వేళలు ఉండాలి.
ప్రతి పిల్లవాడి నేర్చుకునే విధానం వేరు. కొందరు చూసి, కొందరు విని, కొందరు చేసి నేర్చుకుంటారు. సాంప్రదాయిక పద్ధతులు బోరింగ్‌గా అనిపిస్తే చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. చార్టులు, గేమ్స్, కథల ద్వారా చదువును ఆసక్తికరంగా మార్చాలి.
జంక్ ఫుడ్, సమతుల్య ఆహారం వల్ల శక్తి తగ్గుతుంది. ఐరన్, విటమిన్ల లోపం అలసట, ఏకాగ్రత లేకపోవడానికి కారణమవుతాయి. పండ్లు, కూరగాయలు, పాలు, నట్స్, ప్రోటీన్లు రోజూ ఇవ్వాలి. తగినంత నీళ్లు తాగడం కూడా ముఖ్యం.
స్కూల్‌లో ఒత్తిడి, స్నేహితుల సమస్యలు, కుటుంబ వివాదాలు పిల్లల మూడ్‌ను చెడగొడుతాయి. ఈ భావాలను వ్యక్తం చేయలేక చిరాకు, ఆందోళన చూపిస్తారు. అందుకే తల్లిదండ్రులు ఓపికగా వారి సమస్యలు వినాలి, మద్దతు ఇవ్వాలి.
మొబైల్, టీవీ ఎక్కువగా చూడటం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. బ్లూ లైట్ నిద్రను చెడుతుంది. నిద్ర లేకపోతే అలసట, చిరాకు పెరుగుతాయి. రాత్రి స్క్రీన్ టైమ్ తగ్గించి ఆటలు, బయట ఆడుకోవడం ప్రోత్సహించాలి.
స్థిరమైన రొటీన్ లేకపోతే పిల్లలు మానసికంగా సిద్ధంగా ఉండలేరు. చదువు, నిద్ర, ఆటలకు నిర్ణీత సమయాలు ఉండాలి.
ఎక్కువ సేపు ఒకేసారి చదువుకోవడం వల్ల ఏకాగ్రత తగ్గి చిరాకు వస్తుంది. చిన్న చిన్న బ్రేక్స్ ఇవ్వాలి. స్ట్రెచింగ్ లేదా నడక మెదడును రిఫ్రెష్ చేస్తుంది.
నిరంతర అలసట రక్తహీనత, విటమిన్ లోపం, కంటి సమస్యల వల్ల కావచ్చు. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలి.
Also Read: చాణక్య నీతి.. గాడిద నుంచి నేర్చుకోవాల్సిన 3 జీవిత పాఠాలు
పిల్లల కోసం ఇంట్లో పాజిటివ్ వాతావరణం సృష్టించండి. అరవడం, ఎక్కువ విమర్శలు మానండి. చిన్న విజయాలను ప్రశంసించండి. ఓపికగా మాట్లాడండి. సమతుల్య రొటీన్, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర ఉండాలి.