Workplace Stress Diabetes| సరైన జీవనశైలి లేకుంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలాగే మానసిక ఒత్తిడితో ఆరోగ్యానికి తీరని నష్టం జరుగుతుంది. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో కూడా ఈ విషయం బయటపడింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. పనిలో భావోద్వేగ ఒత్తిడి, సహోద్యోగులతో నేరుగా గొడవలతో.. షుగర్ వ్యాధి (డయాబెటిస్) వచ్చే ప్రమాదం.. 24 శాతం పెరుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఉద్యోగాల్లో పనిచేసే మహిళలకు.. పనిలో తక్కువ సామాజిక మద్దతు ఉంటే, ఈ ప్రమాదం 47 శాతం వరకు పెరుగుతుందని తేలింది.
ఈ అధ్యయనం ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కస్టమర్లు, లేదా ప్రజలతో నేరుగా సంబంధాలు నిర్వహించాల్సిన ఉద్యోగాలు ఒత్తిడిని కలిగిస్తాయని, ఇది ఉద్యోగుల ఆరోగ్యంపై, ముఖ్యంగా జీవక్రియ సంబంధిత సమస్యలపై ప్రభావం చూపుతుందని అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు.
పనిలో ఒత్తిడి కారణాలు
ఉద్యోగంలో ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం, హింస లేదా బెదిరింపులు వంటి అంశాలు షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. అయితే కస్టమర్లతో, లేదా ఇతర వ్యక్తులతో నేరుగా సంభాషించాల్సిన ఉద్యోగాలు.. ఉద్యోగిని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈ అధ్యయనం వెల్లడించింది.
స్వీడన్‌లో 2005లో నమోదైన సుమారు 30 లక్షల మంది డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 30-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు, గతంలో షుగర్ వ్యాధి లేనివారు ఉన్నారు. సర్వీస్, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ వంటి ప్రజలతో ఎక్కువగా సంబంధం కలిగి ఉండే 20 రకాల ఉద్యోగాలను పరిశీలించారు. సాధారణ సంభాషణలు, ఒత్తిడి సమయంలో భావోద్వేగ డిమాండ్లు, గొడవలు వంటి మూడు రకాల సంబంధాలను అధ్యయనం చేశారు.
షుగర్ వ్యాధి ప్రమాదం
2006 నుండి 2020 వరకు.. ఈ అధ్యయనంలో 2 లక్షల మందికి టైప్-2 షుగర్ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. వీరిలో 60 శాతం మంది పురుషులు. షుగర్ వచ్చినవారు సాధారణంగా వయస్సులో పెద్దవారు, స్వీడన్ వెలుపల జన్మించినవారు, తక్కువ విద్యాభ్యాసం ఉన్నవారు. ఉద్యోగంలో తక్కువ నియంత్రణ ఉన్నవారని తేలింది.
పురుషులలో భావోద్వేగ ఒత్తిడి 20 శాతం.. గొడవలు 15 శాతం.. షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచాయి. మహిళలలో ఇవి వరుసగా 24 శాతం, 20 శాతం పెరిగాయి. ముఖ్యంగా తమ కుటుంబం, స్నేహితుల నుంచి మానసిక మద్దతు తక్కువగా ఉన్న మహిళలకు 47 శాతం వరకు ప్రమాదం ఉందని తేలింది.
Also Read: మష్రూమ్స్ తింటున్నారా? జాగ్రత్త.. పుట్టగొడుగులు తిని ఆరుగురు మృతి
ఒత్తిడి, షుగర్ వ్యాధి మధ్య సంబంధం
ఒత్తిడి హార్మోన్ ‘కార్టిసాల్’ ఎక్కువగా ఉత్పత్తి అవడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వంటి జీవ రసాయన ప్రక్రియలు ఈ సంబంధానికి కారణమని పరిశోధకులు తెలిపారు. పనిలో సామాజిక మద్దతు లేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఉద్యోగులు తమ నిజమైన భావోద్వేగాలను దాచి, సమాజం లేదా సంస్థ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాల్సి రావడం ఒత్తిడిని కలిగిస్తుందని వారు వివరించారు. ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే.. హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం పడి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఈ అధ్యయనం ఉద్యోగంలో ఒత్తిడి, సామాజిక మద్దతు లేకపోవడం వంటి అంశాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వెల్లడించింది. ఆఫీసు లేదా పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఉత్సాహంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడం షుగర్ వ్యాధి నివారణకు ముఖ్యమని ఈ అధ్యయనం సూచిస్తోంది.