Multi Approach Cancer Treatment Yale University | క్యాన్సర్ వ్యాధి చికిత్సలో యేల్ యూనివర్సిటీ పరిశోధకలు కొత్త ప్రయోగం చేశారు. క్యాన్సర్ ట్యూమర్లపై అన్ని వైపులా దాడి చేసి వాటిని నియంత్రించే విధంగా ఈ ప్రయోగం చేసి దాదాపు విజయం సాధించారు. క్యాన్సర్ కణాలు శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి, తమ స్వీయ వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటాయి. దీని వల్ల క్యాన్సర్ చికిత్సను మరింత కష్టతరం చేస్తుంది. ఈ సమస్యను సమర్థంవంతంగా పరిష్కరించగల చికిత్స విధానాన్ని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త ఇమ్యూనోథెరపీ విధానం ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది నాలుగు రకాల క్యాన్సర్లపై విజయవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.
క్యాన్సర్ కణితి కణాలు (ట్యూమర్ సెల్స్) తమ పరిసర కణజాలాలపై ప్రభావం చూపుతాయి. కణితికి సమీపంలో ఉన్న కణజాలం తీరు, దూరంగా ఉన్న కణజాలం తీరుతో భిన్నంగా ఉంటుంది. ఈ తేడా ఉండడానికి క్యాన్సర్ కణాల ప్రభావమే ప్రధాన కారణం. ఇవి శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటూ ఉంటాయి. దాంతో క్యాన్సర్ కణితి వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. వీటిని “ప్రో-ట్యూమర్ చర్యలు” అని అంటారు.
Also Read: కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి.. ఇలా చేయండి
ప్రస్తుతం చికిత్సలో పరిమితులు
సాంప్రదాయ ఇమ్యూనోథెరపీ చికిత్సలు కణితిలో ఒకే రకమైన రేణువును లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే, దీనిలో కొన్ని పరిమితులు ఉన్నాయి:
లక్ష్యంగా ఎంచుకున్న రేణువు కణితిలో ముఖ్యపాత్ర పోషించకపోవచ్చు.
ఒక రేణువు నిర్వీర్యం చేయబడినా, అలాంటి మరొకటి పనిచేసే అవకాశం ఉంది.
కణితి సూక్ష్మవాతావరణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది పెద్ద నెట్‌వర్క్‌లా పనిచేస్తూ రోగనిరోధక వ్యవస్థను అణచివేస్తుంది.
ఈ కారణాల వల్ల ఇమ్యూనోథెరపీతో కేవలం 20-30 శాతం మంది రోగులకే ప్రయోజనం కలుగుతుంది.
యేల్ పరిశోధకుల సరికొత్త పరిష్కారం
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కాస్13 (Cas13) అనే జన్యు ఎడిటింగ్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఆర్‌ఎన్‌ఏ రేణువులను లక్ష్యంగా చేసుకుంటూ, వాటిని క్షీణింపజేస్తుంది. కాస్13 ద్వారా ఏకకాలంలో అనేక జన్యువులను నిర్వీర్యం చేయవచ్చు. శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణితిలో రోగనిరోధక వ్యవస్థను అణచివేసే అనేక జన్యువులను గుర్తించారు. వీటిని నిరోధించడానికి కాస్13 ఆధారిత ప్యాకేజీని రూపొందించారు. ఈ ప్యాకేజీని ఎలుకల కణితిలో ప్రవేశపెట్టగా, అది రోగనిరోధక ప్రతిస్పందనను అణచివేసే జన్యువులను నిర్వీర్యం చేసింది.
చికిత్స ఫలితాలు
ఈ కొత్త విధానం వల్ల కణితి సూక్ష్మవాతావరణం పూర్తిగా మారిపోయింది. రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్ కణాలపై సమర్థంగా దాడి చేయగలిగేలా మెరుగుపరచింది. ఇది రొమ్ము, చర్మ, క్లోమ, పెద్దపేగు లాంటి నాలుగ రకాల క్యాన్సర్లలో కణితి పరిమాణాన్ని గణనీయంగా తగ్గించింది.
నిర్ధారణ
ఈ సరికొత్త ఇమ్యూనోథెరపీ పద్ధతి వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారే అవకాశముంది. దీని ద్వారా బహుళ రకాల క్యాన్సర్లకు శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు.