Anjali Nair:సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదురయ్యే చేదు అనుభవాలను మీడియాతో పంచుకోవడానికి కొంతమంది వెనుకడుగు వేస్తే.. మరి కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. అలాంటి వారిలో ‘దృశ్యం 2’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న అంజలి నాయర్ (Anjali nair) కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది.
కత్తితో బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకున్నాడు..
అంజలి నాయర్ మాట్లాడుతూ.. “నేను తమిళ్లో ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye kadhalipen) సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా నిర్మాత నాకు తన ప్రేమ విషయాన్ని తెలిపాడు. ఆ వ్యక్తి ఆ సినిమాను నిర్మించడంతోపాటు అందులో విలన్ గా కూడా నటించాడు. అయితే అతడి ప్రేమను నేను నిరాకరించాను. దాంతో నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి నేను వేరే సినిమాకు వెళ్ళినప్పుడు.. ఆ సెట్స్ కి వచ్చి వేధించేవాడు. అయితే ఒకసారి నేను రైలు ప్రయాణం చేస్తుండగా.. ఎక్కడి నుంచో వచ్చాడో తెలియదు కానీ సడన్గా నా పక్కనే కూర్చుని నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఎంతో బ్రతిమలాడాను. దాంతో రైలు డోరు దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూసాడు. ఇది కాస్త పక్కన పెడితే.. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి, తన తల్లి ఆరోగ్యం బాగోలేదని నన్ను చూడాలని కలవరిస్తోందని తెలిపింది. అతడు ఇంట్లో ఉంటే రానని నేను చెప్పాను. దానికి ఆమె తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్ల్యాండ్ కు వెళ్లిపోయాడని, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పింది. నేను నిజమేననుకొని అక్కడికి వెళ్తే.. ఒక గదిలోకి వెళ్ళగానే బయట నుండి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడని నాకు తెలియదు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. నేను నిరాకరించడంతో కత్తితో బెదిరించి సంతకం చేయించుకున్నాడు. అంతేకాదు ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. గది నుంచి ఎలాగోలా ఆ తర్వాత బయటపడ్డాను. కానీ అతడు నాతో సంతకం చేయించుకున్న పేపర్లలో.. అతడు నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ గా నటించాలని ఆ కాంట్రాక్ట్ పేపర్ల పైన నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని తెలిసింది. దీంతో అతడి పై నేను కేసు పెట్టాను. ఆ తర్వాత సాక్షాధారాలు అన్ని కోర్టుకు సమర్పించడంతో కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ నాకు కనిపించలేదు అంటూ తన బాధను వెళ్లబుచ్చుకుంది అంజలి.
అంజలి కెరియర్..
అంజలి కెరియర్ విషయానికి వస్తే.. మలయాళం లో ద కింగ్ అండ్ ద కమిషనర్, 100 డిగ్రీ సెల్సియస్, లైలా ఓ లైలా, దృశ్యం టూ ఇలా పలు చిత్రాలలో చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తమిళంలో చేసిన చిత్తా సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు అందుకుంది.ఇక 2011 లో దర్శకుడు అనీష్ ను పెళ్లి చేసుకున్న ఈమెకు, అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చిన ఈమె, 2022లో అజిత్ రాజును రెండవ వివాహం చేసుకోగా.. వీరికి కూడా ఒక అమ్మాయి జన్మించింది.