Liver Health Truths| మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక హీరో, ఒక ఫైటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది మీ పక్కటెముకల కింద నిశ్శబ్దంగా ఉంటూ, రోజూ వందలాది పనులు చేస్తుంది—ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం, విషాలను వడపోసడం, హార్మోన్లను సమతుల్యం చేయడం, శరీరాన్ని సజావుగా నడపడం.. ఇలాంటి కీలక బాధ్యతలను మోస్తూ నిరంతరం మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది.
అలాంటి లివర్‌కు సమస్య వస్తే ఇంకేమైనా ఉందా?. కానీ చాలామంది లివర్ కు తెలియకుండా హాని కలిగిస్తూ ఉంటారు. లివర్ ఆరోగ్యంగా ఉండాలని, బాగా పనిచేస్తూ ఉండాలని లేకపోతే శరీరానికి రోగాలు చట్టుముడతాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ సమస్య రాకముందే దాని గురించి ఎవరూ ఆలోచించరు.
AIIMS, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో శిక్షణ పొందిన లివర్, గట్ ( పొట్ట,పేగు) నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథీ, లివర్ గురించి 9 ముఖ్యమైన నిజాలను సరళ భాషలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. లివర్‌ను దెబ్బతీసే అలవాట్లు, వాటిని ఎలా సరిచేయాలో వివరించారు.
1.లివర్ దెబ్బతిన్నా తిరిగి కోలుకుంటుంది, కానీ ఎల్లప్పుడూ కాదు
లివర్ అద్భుతంగా తనను తాను రిపేర్ చేసుకోగలదు. దెబ్బతిన్నా లేదా కొంత భాగం తొలగించినా అది తిరిగి పెరుగుతుంది. కానీ మద్యం, కొవ్వు పేరుకుపోవడం లేదా వ్యాధుల వల్ల దీర్ఘకాలిక దెబ్బ తగిలితే, గాయాలు (సిరోసిస్) ఏర్పడతాయి. అప్పుడు లివర్ సాధారణంగా పనిచేయదు. కాబట్టి, ఇప్పుడే జాగ్రత్త తీసుకోండి.
2. కాఫీ లివర్‌కు మంచిదేనా?
చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే రోజుకు మితంగా తాగాలి. ప్రతి రోజు రెండు కప్పులకు మించి కాఫీ తాగకూడదు. రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ కప్పులు తాగితే సిరోసిస్, లివర్ క్యాన్సర్ ప్రమాదం 40 శాతం వరకు తగ్గుతుంది. అయితే అందులో చక్కెర, క్రీమ్ వేయకండి. బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిది.
3. మద్యం తాగని వారికి కూడా ఫ్యాటీ లివర్
మద్యం తాగకపోయినా, ప్రతి 3 మందిలో ఒకరికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వస్తుంది. కొవ్వు లివర్‌లో పేరుకుంటుంది, ఆరంభంలో లక్షణాలు కనిపించవు. కానీ లోలోపల లివర్ చెడిపోతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణ వంటి అలవాట్లు దీన్ని నివారిస్తాయి.
4. తినే ప్రతి ఔషధం లివర్ ద్వారానే
అనారోగ్యం చేస్తే మీరు తీసుకునే ఔషధాలు, పెయిన్ కిల్లర్ మాత్రలు, విటమిన్ టాబ్లెట్స్ అన్నింటినీ లివర్ ముందుగా ఫిల్టర్ చేస్తుంది. పారాసెటమాల్ ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. కొత్త మందులు లేదా సప్లిమెంట్లు తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.
7. నీరసం నిద్ర లివర్‌కు హాని
నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. మీ మెదడుకే కాదు, లివర్ ఆరోగ్యానికి కూడా అవసరం. సరిగా నిద్ర లేకపోతే, శరీరంలోని మలినాలు, విషాలను తొలగించడం, కొవ్వును విచ్ఛిన్నం చేయడం లివర్‌కు కష్టమవుతుంది. అందుకే ప్రతి రోజు 7-9 గంటల నిద్ర తప్పనిసరి.
6. లివర్‌కు గడియారం ఉంది
లివర్ సర్కాడియన్ రిథమ్ (శరీరంలోని గడియారం) తో పనిచేస్తుంది. రాత్రి ఆలస్యంగా తింటే.. ఆ గడియారం షెడ్యూల్‌ను దెబ్బతీస్తుంది. కొవ్వు, విషాలను తొలగించే లివర్ సామర్థ్యం తగ్గుతుంది. సమయానికి భోజనం చేయండి, రాత్రి స్నాక్స్ మానండి.
7. లివర్‌ను దెబ్బతీస్తున్న బ్యూటీ, ఇతర ప్రాడక్ట్స్
క్లీనింగ్ స్ప్రేలు, ఎయిర్ ఫ్రెషనర్లు, పురుగుమందులు, “నాచురల్” అని చెప్పే బ్యూటీ ఉత్పత్తులు కూడా లివర్‌పై భారం వేస్తాయి. సహజ ఉత్పత్తులు ఉపయోగించండి. ఇంట్లో గాలి బాగా ఆడేలా చూసుకోండి.
8. సప్లిమెంట్లు ప్రమాదకరం కావచ్చు
ఆయుర్వేద లేదా హెర్బల్ సప్లిమెంట్లు సురక్షితమని అనుకుంటాం, కానీ కొన్ని లివర్‌లో వాపును కలిగిస్తాయి. మందులతో కలిపితే ప్రమాదం ఎక్కువ. కొత్త సప్లిమెంట్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి.
9. లివర్ కు నేస్తం నీరు
రోజూ 2-3 లీటర్ల స్వచ్ఛమైన నీరు తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మలినాలు, విషాలను తొలగించడానికి సహాయపడుతుంది.
లివర్ సమస్యలు నిశ్శబ్దంగా వస్తాయి. అలసట, జీర్ణ సమస్యలు, ఆలోచనలో స్పష్టత లేకపోవడం వంటి చిన్న సంకేతాలను మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ సమస్య తీవ్రమైనప్పుడు గుర్తిస్తాం. అందుకే ఇప్పుడే మీ అలవాట్లను సరిదిద్దండి, లేకపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: మీ బాత్ టవల్స్ నిండా బ్యాక్టీరియా.. అధ్యయనంలో షాకింగ్ ఫ్యాక్ట్స్
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా లక్షణాలు లేదా సందేహాలు ఉంటే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.