Towel Bacteria| మీరు రోజూ ఉపయోగించే టవల్ శుభ్రంగా కనిపించవచ్చు. కానీ అది మీ బాత్రూమ్‌లో అత్యంత మురికి వస్తువుల్లో ఒకటి కావచ్చు. పరిశోధకులు బాత్ టవల్స్‌ను పరీక్షించగా.. షాకింగ్ ఫలితాలు వచ్చాయి. కొన్ని టవల్స్ బాక్టీరియా, ఈస్ట్, బూజుతో నిండి ఉన్నాయి. ఈ ప్రయోగం సింగపూర్ లో జరిగింది.
సింగపూర్ టీవీ షో “టాకింగ్ పాయింట్”లో భాగంగా ఈ ప్రయోగం జరిగింది. ఎనిమిది మందికి చెందిన టవల్స్‌ను రిపబ్లిక్ పాలిటెక్నిక్ ల్యాబ్‌లో పరీక్షించారు. టవల్స్ సాధారణంగా కనిపించినా.. వాటిలో నిండా క్రిములున్నాయని ఫలితాల్లో తేలింది. జస్టినా టాన్ అనే మహిళ టవల్.. అత్యంత మురికిగా ఉన్నవాటిలో రెండో స్థానంలో ఉందని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆమె రోజూ ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించి, మూడు నుండి నాలుగు వారాలకు ఒకసారి మాత్రమే వాష్ చేసేది.
మహ్మద్ షెరెఫుద్దీన్ అనే యువకుడి టవల్ అత్యంత మురికిగా ఉంది. అతను దుర్వాసన వచ్చినప్పుడు మాత్రమే టవల్ ఉతికేసేవాడు. కానీ ప్రతిరోజూ రెండు సార్లు ఉపయోగించేవాడు. అతని టవల్‌లో బాక్టీరియా, ఈస్ట్, బూజు నిండి ఉన్నాయి. 1,200 మందితో జరిగిన మరో సర్వేలో టవల్ కడిగే అలవాట్లు వేర్వేరుగా ఉన్నాయి. 11 శాతం మంది నెలకు ఒకసారి లేదా అంతకంటే తక్కువగా ఉతికేవారు, 14 శాతం మంది రెండు వారాలకు ఒకసారి, సగం మంది వారానికి ఒకసారి కడిగారు. కానీ నిపుణులు టవల్ ఎంత తరచూ కడిగినా, అది ఒక్కటే సమస్య కాదని చెప్పారు.
చాలా మంది టవల్స్‌ను బాత్రూమ్‌లో ఆరేస్తారు. అక్కడ గాలి తక్కువగా వీస్తుంది, పైగా తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది క్రిములు పెరిగేందుకు అనువైన పరిస్థితి. ఎలిజబెత్ పుర్వాదినాటా వారానికి ఒకసారి ఉతికేసినా.. బాత్రూమ్‌లో ఆరబెట్టడం వల్ల ఆమె టవల్‌లో బాక్టీరియా ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇదే అలవాటు ఉన్న మరో మహిళ కై లియో టవల్‌లో ఈస్ట్ కనిపించింది.
హిల్లరీ హో టవల్ అత్యంత శుభ్రంగా ఉంది. ఆమె మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి ఉతికేసి, కిటికీలు తెరిచిన గదిలో ఆరబెట్టేది. ఆమె టవల్‌లో క్రిములు చాలా తక్కువగా ఉన్నాయి.
స్నానం తర్వాత ఉపయోగించే టవల్స్ ఎందుకు మురికిగా ఉంటాయి? నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ హో చెప్పిన ప్రకారం.. సబ్బు ఉపయోగించినా మన చర్మంపై కొన్ని బాక్టీరియా ఉంటాయి. ఇవి టవల్‌కు అంటుకుని, టవల్ తడిగా ఉంటే పెరుగుతాయి.
మురికి టవల్స్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయా?
చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంజెలిన్ యోంగ్ ప్రకారం.. సూడోమోనాస్ వంటి బాక్టీరియా చర్మ ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం, ఎగ్జిమా, లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో. శరీరం, ముఖానికి ఒకే టవల్ ఉపయోగిస్తే ‘E. కోలై’ వంటి బాక్టీరియా ముఖానికి వ్యాపిస్తుంది. బూజు అలెర్జీలు లేదా చర్మ దురదను కలిగిస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో సమస్యలను సృష్టిస్తాయి.
నిపుణులు వారానికి రెండు సార్లు టవల్ వాష్ చేయాలని సిఫారసు చేస్తున్నారు. ముఖ్యంగా తరచూ ఉపయోగిస్తే. తడిగా ఉన్న టవల్స్‌లో క్రిములు త్వరగా పెరుగుతాయి. ఎండలో లేదా గాలి బాగా తిరిగే చోట ఆరబెట్టడం మంచిది. ఒక పరీక్షలో, బాత్రూమ్‌లో ఆరబెట్టిన టవల్‌లో ఒక రోజులో 600 బాక్టీరియా కాలనీలు కనిపించాయి. అయితే ఎండలో ఆరబెట్టిన టవల్‌లో సగం మాత్రమే ఉన్నాయి.
టవల్ మెటీరియల్ కూడా ముఖ్యం. కాటన్ టవల్స్ నీటిని ఎక్కువగా పీల్చుకుని నెమ్మదిగా ఆరతాయి. బాక్టీరియా పెరగడానికి అవకాశం ఇస్తాయి. మైక్రోఫైబర్ టవల్స్ కొంచెం మెరుగైనవి, కానీ బాంబూ, యాంటీమైక్రోబియల్ టవల్స్‌లో క్రిములు తక్కువగా కనిపించాయి. అయినా, యాంటీమైక్రోబియల్ టవల్స్‌ని కూడా రెగ్యులర్‌గా ఉతకాలి.
టవల్‌ను తరచూ వాస్ చేయడం, బాగా ఆరబెట్టండి, సాధ్యమైతే ఎండలో ఆరబెట్టండి. శుభ్రమైన టవల్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.