Telugu Comedy:తెలుగు సినిమా…ఎంత అడ్వాన్స్ అయిపోయినా,ఎంత ఎదిగిపోయినా ఈ సోకాల్డ్ కామెడీ సీన్లు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.ఇవి గనుక లేకపోతే మేము తీసేది తెలుగు సినిమా కాదు కాబోలు అంటూ మన దర్శకరచయితలు గాబరా పడిపోతారేమో.అందుకే అవకాశం ఉంటే..కాదు కాదు అవకాశం లేకున్నా ఈ టెంప్లెట్ ని మన తెలుగు సినిమాల్లో ఇరికించేందుకు శతవిధాలా కష్టపడిపోతుంటారు.మరింతకీ సోషల్ మీడియా జమానా వచ్చాక కూడా ఆడియన్స్ ని గత కొంతకాలంగా అలరిస్తూ, హడలగొడుతూ, అన్ని రకాల ఎమోషన్స్ కి గురి చేస్తున్న ఈ కామెడీ సీన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
ముఖ్యమైన ఫార్ములా ..అపార్థం
మొదటగా చూస్తే..మన దర్శకులు ఆడియన్స్ కి కితకితలు పెట్టే క్రమంలో ఎంచుకునే ముఖ్యమైన ఫార్ములా ..అపార్థం. మొదటగా బిజినెస్ మ్యాన్ గా ఉన్నవాడిని బికారిని అని రివీల్ చేస్తారు.డాక్టర్ గా చూపించిన వాన్ని కంపౌండర్ చేసేస్తారు.ఒకన్ని పెళ్లి పీటల మీద కోర్చోబెట్టి పెళ్లి కొడుకు అనేసారు.తీరా చూస్తె అతగాడు ఇంకెవరో అయ్యుంటారు.ఇలా ఒక అపార్థం చుటూ కామెడీ ని రంగరించి చివర్లో అబ్బే అంతా అపార్థం.అసలు సంగతే వేరే అంటూ క్లియర్ చేసేపనిలో పడతారు,ఇదిగో ఈ మధ్యలోనే బోలెడంత కామెడీని పిండేస్తారు మన దర్శకరచయితలు.అయితే అది బోర్ కొట్టినప్పటికీ ఇప్పటికీ అదే ఫార్ములా వాడటం మన వాళ్ల స్టైల్ అన్నమాట.
పిలిచినట్టు వచ్చే హీరోయిన్
ఇక హీరో హీరోయిన్ పట్ల ఉన్న ప్రేమని కాని, కోపాన్ని కాని ,లేక ఏదైనా సీక్రెట్ ని కాని తన ఫ్రెండ్ లేదా ఇంకెవరికైనా చెబుతుంటే అదే సమయంలో ఎవరో పిలిచినట్టు హీరోయిన్ అక్కడి రావడం అంతా వినడం ఇప్పటికీ ఒక టెంప్లెట్ లా మారిపోయింది.ఇక హీరోయిన్ కి తెలుసు అన్న విషయం ఆడియన్స్ కి తెలీడంతో ఈ విషయం హీరోకి ఎప్పుడు తెలుస్తుందా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తుంటారంతా.ఇక ఇందులోనే కావలసినంత కామెడీని దట్టించడం మన వాళ్ళకి బట్టర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ అన్న మాట.
మరో ఆయుధం ఓవర్ బిల్డప్
ఇక ఆడియన్స్ ని కితకితలు పెట్టడానికి మనవాళ్ళు వాడే మరో ఆయుధం ఓవర్ బిల్డప్.అవును..విలన్ అంటేనే సినిమాలో చుచ్చు కారిపోతుంది.కానీ సినిమాలోని మెయిన్ కమెడియన్ కి మాత్రం వాడో కమెడియన్ లా కనిపిస్తాడు.ముఖ్యంగా అందరిని కను సైగ తో శాసించే విలన్ ని అందరి ముందు ఎర్రిపప్పని చేయడంలో మన కమెడీయన్ మాస్టర్ డిగ్రీ చేసేస్తాడు.ఎన్ని సినిమాల్లో ఇది వచ్చినా ఇప్పటికీ సో కాల్డ్ కమర్షియల్ సినిమాలలో ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.
తాగడానికి గంజి లేకపోయినా తిరగడానికి బెంజ్
ఇక సినిమాల్లో తాగడానికి గంజి లేకపోయినా తిరగడానికి బెంజ్ కార్లు ఉండాల్సిందే అన్నట్టుగా కొన్ని కామెడీ క్యారెక్టర్స్ ని సెటప్ చేస్తుంటారు మన వాళ్ళు.ఇక వీళ్ళు బందువులలో కొట్టే బిల్డప్పులు మాములుగా ఉండవు.ముఖ్యంగా చాలా జేబులో పైసా లేకున్నా కూడా ఓవర్ బిల్డప్పులు ఇవ్వడం ,తీరా సమయానికి అడ్డంగా బుక్కవడం మన సినిమాల్లో రెగ్యులర్ టెంప్లెట్ అయిపోయింది.నిజానికి ఇలాంటివి మన జీవితాల్లో కూడా అడపాదడపా కనిపిస్తూనే ఉంటాయి.అందుకే భాగా క్లిక్ అవుతాయి కూడా.
సమస్య రాగానే వచ్చే ఫ్రెండ్
ఇక హీరోకి ఏదైనా ఏదైనా సమస్య రాగానే వెంటనే ఒక ఫ్రెండ్ లేదా ఒక ముఖ్యమైన మనిషి రంగంలోకి దిగిపోతుంటాడు.వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రాని సొల్యూషన్స్ వాడి ప్రెండ్ కి ప్రాబ్లం వస్తే మాత్రం తన్నుకుంటూ వస్తాయ్. ఇక అతగాడు లవ్ గురూ అన్నట్టుగా అమ్మాయిలని ఎలా డీల్ చేయాలో ఇబ్బడిముబ్బడిగా క్లాసులు పీకుతుంటాడు కాని అతడు మాత్రం ఒక అమ్మాయిని అయినా పడేసినట్టు కనిపించదు.
ఈ టెంప్లెట్ ఏమైనా బ్రేక్ అవుతుందేమో
ఇక రెండు ఇంగ్లీష్ పదాలు రాకున్నా ఇంగ్లీష్ ఇరగదీసే వ్యక్తి, విలన్ చేతిలో తన్నులు తిని హీరో గురించి అసలు విషయం చెప్పకుండా దాచి పెట్టె విలన్ అనుచరులు ..ఇక దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్ళిన దొంగలు ఇంటివాళ్ళకి అడ్డంగా దొరికిపోవడం ,పోలీస్ స్టేషన్ లో పోలీసులని ఆటాడుకునే కమెడీయన్ ..ఇలా ఎన్నో సీన్లు తెలుగు సినిమాలలో మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి.
నిజానికి ఇవన్నీ ఆడియన్స్ కి అర్థం అయిపోతాయని ముందే తెల్సినప్పటికీ మేకర్స్ వీటినో టెంప్లెట్ లా మళ్ళీ ప్రయోగించడమే ఇక్కడ మ్యాజిక్. చూడాలి మరి ముందు ముందు ఈ టెంప్లెట్ ఏమైనా బ్రేక్ అవుతుందేమో
ALSO READ :జగదాంబ థియేటర్ కథ ఇదే.. వైజాగ్ సినిమా కల్చర్‌కు ఎలా ఐకాన్ అయింది?