Manchu Manoj:వెండితెరపై విభిన్నమైన యాక్షన్ తో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు మంచు మనోజ్ (Manchu Manoj).. భైరవం సినిమాతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత వచ్చిన తేజ సజ్జ ‘మిరాయ్’ చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మరొకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న దాదా సినిమాలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక మరొకవైపు ఈయన ప్రధాన పాత్రలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈయన పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి దారులను ఆకర్షించడమే లక్ష్యంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంచు మనోజ్ దంపతులు ఏపీ ప్రభుత్వంతో కలిసి పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎం ఓ యు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ మేరకు మంచు మనోజ్ దంపతులు ప్రభుత్వ పెద్దలు పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఎం ఓ యు పత్రాలపై సంతకాలు కూడా చేశారు.
మంచు మనోజ్ , ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి నవంబర్ 12న విశాఖపట్నంలో జరిగిన 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు – 2026 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సుమారుగా రూ.36 కోట్ల ఎంఓయూ ఒప్పందంపై సంతకం చేశారు. వీరి స్టార్టప్ కంపెనీ అయిన “నమస్తే వరల్డ్” తరపున ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భూమా మౌనిక రెడ్డి వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా పనిచేస్తుండగా.. మంచు మనోజ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవోగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ దంపతులు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులో ఒక తయారీ యూనిట్ ను స్థాపించడానికి ఏకంగా రూ.36.24 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు.
సాంప్రదాయ భారతీయ బొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను ఈ యూనిట్ ద్వారా తయారు చేయనున్నారు. అంతేకాదు స్థానిక కళాకారులకు మద్దతు ఇవ్వడం, వారిని పారిశ్రామిక సమూహాలతో అనుసంధానించడం, స్థానిక ప్రజలకు ఉపాధిని కల్పించడమే ఈ ప్రాజెక్టు మొదటి లక్ష్యంగా చెప్పవచ్చు.
also read:అవినాష్ జీవితంలో ఇంత విషాదమా.. జీవితాంతం మరువలేని నరకం అంటూ!
మంచు మనోజ్ సినిమాలలో హీరోగా, విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా సామాజిక సమస్యలపై తరచూ స్పందిస్తూ యువతలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వీరి అడుగులతో భవిష్యత్తులో మరికొంతమంది యువ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి నటుడిగా మంచి విజయాలను చవిచూసిన మంచు మనోజ్.. పారిశ్రామికవేత్తగా కూడా సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మంచు మనోజ్, ప్రియా భవాని శంకర్ , సముద్రఖని ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అహం బ్రహ్మాస్మి. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎం ఎం ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్ ,నిర్మలాదేవి స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ విధంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా మంచు మనోజ్ ఒకవైపు హీరోగా మరొకవైపు బిజినెస్ మాన్ గా మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు.