Ghaati Movie..’సూపర్’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందం, అమాయకత్వంతో కట్టిపడేసింది అనుష్క శెట్టి (Anushka Shetty). నాగార్జున (Nagarjuna) సరసన హీరోయిన్ గా నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘అరుంధతి’ లాంటి రాజసం ఉట్టిపడే పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు..’బిల్లా’ వంటి చిత్రాలలో బికినీతో కూడా ఆకట్టుకోగలను అని నిరూపించింది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంటున్న ఈమె..’బాహుబలి’ లాంటి సినిమాల్లో తన అద్భుతమైన, విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ‘భాగమతి’ వంటి చిత్రాలతో అందర్నీ భయపెట్టింది కూడా.. అలా అన్ని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి, విలక్షణ నటిగా పేరు సొంతం చేసుకున్న అనుష్క.. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఘాటీతో మళ్లీ మన ముందుకు వస్తున్న అనుష్క..
ముఖ్యంగా ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత భారీగా బరువు పెరిగిపోయిన ఈమెకు.. అవకాశాలు దాదాపుగా కరువయ్యాయనే చెప్పాలి. ఎప్పుడో చివరిగా నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రముఖ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘ఘాటీ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వేదం’ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది.ఇందులో వేశ్య పాత్ర పోషించి అందరిని అబ్బురపరిచింది అనుష్క. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైట్ ఫీలయ్యారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ నిన్న విడుదల చేసిన పాట మాత్రం పూర్తిస్థాయిలో డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.
ఘాటీ నుండీ ‘సైలోరే’ సాంగ్ విడుదల..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఘాటీ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ ప్రభు (Vikram prabhu)ఇందులో అనుష్కకు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 11వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నాగవెళ్లి విద్యాసాగర్ సంగీత సారధ్యంలో.. కృష్ణ సాహిత్యం అందించగా.. లిప్సిక భాష్యం , సాగర్ నాగవెళ్లి , సోనీ కొమండూరి కలిసి ఆలపించిన సైలోరే అంటూ సారే లిరికల్ పాటను విడుదల చేశారు.
ఉత్సాహాన్ని నింపేలా సైలోరే లిరికల్ సాంగ్..
సాంప్రదాయ శైలిలో ఉండే పెళ్లి పాటను ఆధునిక నిర్మాణంతో మిళితం చేసి, భావోద్వేగాలతో పాటు ఉత్సాహాన్ని నింపేలా ఈ పాటను రూపొందించారు. ముఖ్యంగా కోలాటాలు, రంగుల దుస్తులు, పల్లకీలు, చెరువులు, అడవుల నేపథ్యంలో ఒక రంగుల జాతరలా అనిపించే విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
4 నిమిషాల వీడియోలో 4సెకండ్లు కూడా లేదే..
ఇకపోతే ఈ పాట అంతా బాగానే ఉన్నా ఈ పాటలో మెయిన్ లీడ్ అయిన అనుష్క కనిపించకపోవడం అభిమానులను పూర్తిస్థాయిలో హర్ట్ చేసింది. వాస్తవానికి 4నిమిషాల నిడివి ఉన్న ఈ లిరికల్ వీడియోలో అనుష్క కేవలం 4 షాట్స్ లో మాత్రమే కనిపిస్తుంది. అందుకే కనీసం 4 సెకండ్లు కూడా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అనుష్క ఇందులో పేరుకే మెయిన్ లీడ్.. కనీసం నాలుగు సెకండ్లు కూడా కనిపించలేదు.. అనుష్కకు ఇంత కంటే అవమానం ఇంకోటి వుంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట అనుష్క అభిమానులను మాత్రం పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.
ALSO READ: Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ 9లో అలేఖ్య చిట్టితో పాటు హీరో కూడా… ఫుల్ లిస్ట్ ఇదే!