US Criminal Iran Warning| ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దంలో అమెరికా ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ లోని అణుస్థావరాలపై ఆదివారం ఉదయం బి2 బాంబార్లతో అమెరికా దాడులు చేసింది. ఇవి భారీ బంకర్ బస్టర్ బాంబులు. ఇరాన్‌లోని మూడు ముఖ్యమైన న్యూక్లియర్ సైట్లు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌ల పై అమెరికా జరిపిన వైమానిక దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్, న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ఒప్పందం (NPT)ను ఉల్లంఘించాయని ఆయన ఆరోపించారు. అమెరికా ఒక క్రిమినల్ ల్లాగా ప్రవర్తించింది. దీనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. దీర్ఘకాలం గుర్తుండిపోయేలా శిక్ష విధిస్తామని ఆయన హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఒక పోస్ట్ చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశమైన అమెరికా “నేరపూరిత చర్యలకు” పాల్పడిందని, శాంతియుత న్యూక్లియర్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు అత్యంత దారుణం. ఇవి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తాయి. ఈ దాడులకు గుర్తుండి పోయేలా సమాధానం చెబుతాం. ఐక్యరాజ్యసమితిలోని ప్రతి సభ్యదేశం ఈ అత్యంత ప్రమాదకర, చట్టవిరుద్ధ, నేరపూరిత చర్యలకు వ్యతిరేకంగా స్పందించాలి” అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రపంచ సమాజం ఈ సంఘటనను గమనించాలని కోరుతూ.. అమెరికా తీసుకున్న “ప్రమాదకర, చట్టవిరుద్ధ” చర్యలపై ప్రతి ఐక్యరాజ్యసమితి సభ్యదేశం హెచ్చరికలు జారీ చేయాలని సయ్యద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని నిబంధనలను గుర్తు చేస్తూ..ఇరాన్ తన స్వీయ రక్షణ హక్కును ఉపయోగించుకోవడానికి అన్ని ఎంపికలను కలిగి ఉందని ఆయన తెలిపారు. “ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం.. స్వీయ రక్షణలో చట్టబద్ధమైన సమాధానం ఇచ్చే నిబంధనలకు అనుగుణంగా, ఇరాన్ తన సార్వభౌమాధికారం, ఆసక్తులు, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని మార్గాలను బహిరంగంగా ఉంచుతుంది” అని ఆయన పోస్ట్ ద్వారా తెలియజేశారు.
జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఆకస్మిక దాడులు చేసింది, ఇరాన్ న్యూక్లియర్ బాంబులను తయారు చేయబోతోందని ఆరోపించింది. ఇరాన్ తన న్యూక్లియర్ కార్యక్రమం శాంతియుతమైనదని చెబుతూ, ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో సమాధానం ఇచ్చింది. ఈ అమెరికా దాడుల వరకు, అమెరికా ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌కు సహాయం చేసింది కానీ నేరుగా ఇరాన్‌పై దాడులు చేయలేదు.
ఇరాన్ కీలక అణు స్థావరాలు ఇవే..
నటాంజ్ యురేనియం సంవర్ధన కేంద్రం (Natanz Uranium Enrichment Facility) : టెహ్రాన్‌కు 220 కిలోమీటర్ల ఆగ్నేయంలో ఉన్న నటాంజ్ ఇరాన్‌లో యురేనియం సంవర్ధనం కోసం ప్రధాన కేంద్రం. ఇక్కడ యురేనియం 60శాతం స్వచ్ఛతతో సంవర్ధనం చేయబడింది. ఇది ఆయుధ-స్థాయికి చేరువలో ఉంది. ఇజ్రాయెల్ దాడులతో దీని ఉపరితల భాగం ధ్వంసమైంది. భూగర్భంలో ఉన్న భాగం కూడా దెబ్బతిని, సెంట్రిఫ్యూజ్‌లు (యురేనియం సంవర్ధన యంత్రాలు) చాలా వరకు నాశనమయ్యాయి.
ఫోర్డో యురేనియం సంవర్ధన కేంద్రం (Fordow Uranium Enrichment Facility): టెహ్రాన్‌కు 100 కిలోమీటర్ల నైరుతిలో ఉన్న ఫోర్డో ఒక చిన్న ఫెసిటిలీ. కానీ ఒక పర్వతం కింద నిర్మించబడిన బలమైన సౌకర్యం. 2009 వరకు రహస్యంగా ఉంచబడింది. దీనిని దెబ్బతీయడానికి అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌లు ఉపయోగించే “బంకర్ బస్టర్” బాంబులు అవసరం.
ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ (Isfahan Nuclear Technology Centre): టెహ్రాన్‌కు 350 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో ఉన్న ఇస్ఫహాన్‌లో వేలాది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఇక్కడ మూడు చైనీస్ పరిశోధన రియాక్టర్లు.. న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం ల్యాబ్స్ ఉన్నాయి.
Also Read: ఇరాన్‌పై అమెరికా దాడి.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఆందోళన
ఇరాన్‌లో బుషెహర్ విద్యుత్ కేంద్రం, అరాక్ రియాక్టర్ వంటి ఇతర న్యూక్లియర్ సైట్లు ఈ దాడులలో లక్ష్యంగా లేవు. ఈ దాడులు ఇరాన్-అమెరికా మధ్య చర్చలను, ఇరాన్ న్యూక్లియర్ కార్యకలాపాలను పరిమితం చేయడానికి బదులుగా ఆర్థిక ఆంక్షలను సడలించే ఒప్పందాన్ని దెబ్బతీశాయి. ఈ దాడులు మరింత సంఘర్షణకు దారితీసే అవకాశం ఉంది.