Bengali Actors: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత ఎన్నికల నాటి ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ప్రముఖ బెంగాలీ నటులు పరంబ్రత ఛటోపాధ్యాయ, స్వస్తికా ముఖర్జీలపై కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఒక తీవ్రమైన రాజకీయ వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, హింసను ప్రేరేపించేలా వీరి పోస్టులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు గరియాహట్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
Read also-అందుకే జైల్లో కన్నీళ్లు పెట్టుకున్నా.. పోసాని కృష్ణమురళి ఎమోషనల్..
న్యాయవాది జయదీప్ సేన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2021 మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్పష్టమైన మెజారిటీ సాధించిన తరుణంలో ఈ వివాదం మొదలైంది. మే 2, 2021న నటుడు పరంబ్రత ఛటోపాధ్యాయ తన అప్పటి ట్విట్టర్ ఖాతాలో “ఈ రోజును ప్రపంచ తన్నుల దినోత్సవంగా ప్రకటిద్దాం” అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యకు నటి స్వస్తికా ముఖర్జీ స్పందిస్తూ ” హాహాహా, అలాగే కానివ్వండి” అని కామెంట్ పెట్టారు. ఈ సంభాషణ అంతా అప్పట్లో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, అలజడులు జరుగుతున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ హింసను మరింత రెచ్చగొట్టేలా చేశాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ సోషల్ మీడియా పోస్టులు వచ్చిన కొద్ది గంటల్లోనే బెలియాఘాటా ప్రాంతంలో అభిజిత్ సర్కార్ అనే బీజేపీ కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యారని, ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలే ఆయా దాడులకు వెనుక ఉన్న మూకలకు ప్రేరణగా నిలిచాయని న్యాయవాది ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలో కొత్త చట్టాలు మల్లోకి వచ్చినప్పటికీ, ఈ ఘటన 2021లో జరిగినందున అప్పటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ముఖ్యంగా నేరానికి ప్రేరేపించడం లేదా సహకరించడం వంటి అంశాలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 107 కింద కేసు నమోదు చేయాలని కోరారు. కోల్‌కతాకు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ, గరియాహట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైందని, చట్టప్రకారం కేసును అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని, దర్యాప్తు ప్రారంభమైందని స్పష్టం చేశారు.
ఈ చట్టపరమైన చర్యలపై నటులు పరంబ్రత ఛటోపాధ్యాయ కానీ, స్వస్తికా ముఖర్జీ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. వీరిద్దరూ బెంగాలీ చిత్ర పరిశ్రమలో అగ్ర నటులుగా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పరంబ్రత హిందీలో ‘కహానీ’, ‘పరి’ వంటి చిత్రాల్లో నటించగా, స్వస్తికా ముఖర్జీ ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి’, ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. సుమారు ఐదేళ్ల క్రితం నాటి ఈ సామాజిక మాధ్యమాల వివాదం ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ దాకా వెళ్లడం చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.