Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులు తమ సమస్యలపై చర్చించుకుని ఏం కావాలో ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు, సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం సినీరంగ కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారితో వివరంగా చెప్పారు.
ఇటీవల నిర్మాతలతో జరిగిన సమావేశంలో సినిమా కార్మికులను విస్మరించవద్దని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరానని చెప్పారు.
చలనచిత్ర రంగంలో కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని, అందుకోసం స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా కార్మికుల శిక్షణ అందించే కార్యక్రమం చేపడుతామని చెప్పారు.
అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా అందరూ సహకరించాలని, ఈ విషయంలో ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని చెప్పారు. చిత్ర పరిశ్రమలో సానుకూల పని వాతావరణాన్ని చెడగొట్టుకుని సమ్మెలకు వెళ్లడం వల్ల రెండు వైపులా నష్టం జరుగుతుందని వివరించారు.
సినిమా కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. ప్రభుత్వం సమస్యలను సమస్యలుగానే చూస్తుందని, వ్యక్తిగత పరిచయాలు ప్రధానం కాదని స్పష్టం చేశారు. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని, ఈ విషయంలో తాను కార్మికుల పక్షాన ఉంటానని చెప్పారు.
అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం ఉంటుందని వివరించారు. సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండలేదని స్పష్టం చేశారు.
అంతకుముందు పదేళ్ల పాటు సినిమా రంగంలో అవార్డులు ఇవ్వని అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ తమ ప్రభుత్వం సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను బహూకరించిన విషయాన్ని వివరించారు. అదే క్రమంలో సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
గడిచిన ఎన్నో ఏళ్లుగా సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరన్న సంగతిని ఈ సందర్భంగా సంఘాల నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారితో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ్