Telugu Film Chamber : ఎట్టకేలకు తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్మికులు సమ్మె విరమించుకున్న విషయం తెలిసిందే. అటు సినిమా షూటింగ్ లు కూడా యధావిధిగా ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యలు లేవు అనుకునేలోపే మరో వివాదం చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. సినీ కార్మికుల సమ్మెకు ముందు ఫిలిం ఛాంబర్ లో చాలా గొడవలు జరిగాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భరత్ భూషణ్ (Bharath Bhushan)కి..2025 జూలై నాటికి పదవీ కాలం పూర్తయింది. ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉండగా..సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన కార్మికుల సమ్మె కారణంగా దీనిపై చాలామంది దృష్టి పెట్టలేకపోయారు. దీంతో ఇన్ని రోజులు ఈ వివాదం కాస్త వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సమ్మె లేదు కాబట్టి ఇప్పుడు చిన్న నిర్మాతలు అందరూ కలిసి ఫిలిం ఛాంబర్ ని ముట్టడించడానికి సిద్ధమయ్యారు.
వదల బొమ్మాళీ వదలా.?
అసలు విషయంలోకి వెళ్తే.. అటు అధ్యక్షుడు భరత్ భూషణ్, కోశాధికారి ప్రసన్నకుమార్ (Prasanna Kumar) కూడా తమ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ చిన్న నిర్మాతలు ఈరోజు ఫిలిం ఛాంబర్ ను ముట్టడించడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే “వదల బొమ్మాళీ వదలా” అంటూ ఈరోజు ఫిలిం ఛాంబర్ ముట్టడికి చిన్న నిర్మాతలందరూ సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ప్రెసిడెంట్ భరత్ భూషణ్ , ప్రసన్న కుమార్ వారి పదవీకాలం పూర్తయినా ఇంకా పదవి నుండి దిగలేదు. దీనిపై పలుమార్లు మీటింగులు జరిగాయి.
ఫిలిం ఛాంబర్ ముట్టడికి సిద్ధమైన చిన్న నిర్మాతలు..
తిరుపతి మీటింగ్ లో ఫిలిం ఛాంబర్ ఈసీ మీటింగ్‌లో కూడా జనరల్ బాడీ పెట్టి కంటిన్యూ అవుతామని తెలిపారు. కానీ జనరల్ బాడీ పెట్టడం లేదు. దీనికి తోడు పదవీ కాలాన్ని పెంచడం కుదరదని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్దామని ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నాడు మీటింగ్లో వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ భరత్ భూషణ్ మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉండడం, నియామకాలు, సంబంధాలు తమ పనిని నిర్ధారిస్తాయని చెప్పడమే కాకుండా తమకు పొడిగింపు అవసరమని భీష్మించుకు కూర్చున్నారు.. ఇక వీరికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అని ఈరోజు మళ్లీ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. చిన్న నిర్మాతలందరూ ఈరోజు సమావేశమై గొడవపడడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పదవీ కాలం పొడిగింపు వెనక ఆంతర్యం ఏమిటి?
వాస్తవానికి ఫిలిం ఛాంబర్ కి అధ్యక్ష పదవి కాలం కేవలం ఏడాది మాత్రమే. ఏడాది పూర్తయినా ఇంకా తమ పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. చిత్రపురిలో ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కారణంగానే భరత్ భూషణ్, ప్రసన్నకుమార్ ఈ పొడిగింపు ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంత ఖరీదైన ప్రాజెక్టు వస్తున్నప్పుడు అధికారంలో ఉండడం మరింత కీలకం. అందుకే మరో ఏడాది పాటు పదవీ కాలాన్ని పొడిగించుకొని సొంత లాభం అందుకోవాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈరోజు ఫిలిం ఛాంబర్ ముట్టడికి చిన్న నిర్మాతలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ALSO READ:Big Breaking: అల్లు ఇంట విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత!