Garividi Lakshmi Biography:గరివిడి లక్ష్మి…ఉత్తరాంద్రని తనదైన బుర్రకథలతో ఒక ఊపు ఊపిన ఈవిడ పేరు తెలీని వారు లేరంటే ఆశ్చర్యం లేదు.అలాంటి గరివిడి లక్ష్మి జీవిత కథతో రూపొందిన గరివిడి లక్ష్మి అనే సినిమా అక్టోబర్ 16న విడుదలకి సిద్దమైంది.ఈ క్రమంలో అసలు ఈ గరివిడి లక్ష్మి ఎవరు? ఇంతలా ప్రాచుర్యం పొందిన ఈ గగరివిడి లక్ష్మి అసలు ఎక్కడివారు ,ఉన్నపళంగా ఎందుకు మాయమయ్యారు, ప్రస్తుతం ఈవిడ గారు ఎక్కడ ఉంటున్నారు అంటూ ఆరాలు తెస్తున్నారు మూవీ లవర్స్.
ఈవిడ అసలు పేరు రెడ్డి విజయలక్షి
గరివిడి లక్ష్మి విషయానికి వస్తే ..ఈవిడ అసలు పేరు రెడ్డి విజయలక్షి ఆలియాస్ పెద్ద లక్ష్మి. ఈవిడది విజయనగరం జిల్లా గరివిడి మండలం గద్దపువలస గ్రామం. ఈవిడది గరివిడి మండలం కావడం వల్లే తనని గరివిడి లక్ష్మి అని పిలుస్తారు అంతా.
అయితే అప్పట్లో షేక్ నాజర్ , కుమ్మరి మాస్టర్ వంటి వారు తమ బుర్ర కథలతో అక్కడి ప్రజానీకాన్ని ఆకట్టుకుంటూ,ఎంతో ఉత్సాహపరిచేవారు,ముఖ్యంగా కథా రూపకంగా ఉండే ఈ బుర్ర కథకి కాళ్ళకి గజ్జెలు కట్టుకొని , సంగీతాన్ని జోడించి,మధ్య మధ్య హాస్యం పండిస్తూ చెప్పే ఈ ప్రదర్శనలు అప్పట్లో ప్రేక్షకులని ఉర్రూతలూగించేవి. దానితో వాటిపై మనసు పారేసుకున్న గరివిడి లక్ష్మి కూడా ఆ బుర్రకథలపై మనసు పారేసుకుంది.
బుర్రకథ నేపథ్యం లేకపోయినప్పటికీ
దాంతో తనకి ఎలాంటి బుర్రకథ నేపథ్యం లేకపోయినప్పటికీ కుమ్మరి మాస్టర్ వద్ద బుర్రకథ చెప్పడంలో శిక్షణ తీసుకుని రాటు దేలింది. అయితే అప్పటి వరకు బుర్ర కథలు కేవలం మగవారే చెప్పడం తో ఆడవాళ్ళు అసలు బుర్ర కథలు చెబుతారా అన్న ప్రశ్న వచ్చేది.కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎక్కడా వెనుదిరిగి చూడకుండా బుర్ర కథ చెప్పడం లో మంచి అనుభవం సంపాదించింది.ముఖ్యంగా అప్పటి వరకు రొటీన్ గా సాగుతున్న బుర్ర కథలకి భిన్నంగా చెప్పే పద్దతిలో మార్పు చేర్పులు చేస్తూ సరికొత్తగా బుర్రకథలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో గరివిడి లక్ష్మి బుర్రకథలకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.
ముఖ్యంగా అప్పటివరకు బుర్రకథలు అంటేనే ఎక్కువగా పురాణ ఇతిహాసాలు, రామాయణ,మహాభారతాలు చెప్పేవారు.కానీ గరివిడి లక్ష్మి వాటిని బ్రేక్ చేస్తూ ఉత్తరాంధ్ర గ్రామీణ జీవితాలు ఎలా ఉంటాయో జానపదాల రూపంలో కళ్ళకి కట్టినట్టుగా ,సరదా సరదా సంభాషణలతో అందరికి అర్థం అయ్యే విధంగా తనదైన స్టెప్పులని యాడ్ చేస్తూ ఆ బుర్రకథలకి మరింత ప్రాధాన్యత తెచ్చిపెట్టింది.
నవ్వుల బండి అప్పట్లో ఒక సెన్సేషన్
అలా 1994లో వేదికలపై బుర్రకథలు చెప్పడం ప్రారంభించిన గరివిడి లక్ష్మి 1996 నాటికి ఉత్తరాంద్రలో ఒక స్టార్ గా ఎదిగింది.ముఖ్యంగా 1996 లో ఆవిడ చెప్పిన బుర్రకథలు ఆడియో క్యాసెట్స్ రూపంలో విచ్చలవిడిగా అమ్ముడు పోయాయి.అలా 1990 లలోనే గరివిడి లక్ష్మి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.ముఖ్యంగా శ్రీమాతా సంస్థలో ఆవిడ చేసిన నవ్వుల బండి అనే కామెడీ ఫోక్ సాంగ్స్ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి.ఆ క్యాసెట్స్ రిలీజ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవంటే గరివిడి లక్ష్మి కున్న ఫాలోయింగ్ ఏంటో ఆవిడ గొంతుకి ఎంత మంది ఫిదా అయ్యుంటారో అర్థం చేసుకోవచ్చు.ఇక అక్కడ జరిగే తిరునాళ్ళు అయినా ,జాతరలు అయినా ,పండగలు,పబ్బాలు ..ఇలా ఏ ఈవెంట్ జరిగినా గరివిడి లక్ష్మి బుర్రకథ ఖచ్చితంగా ఉండితీరాల్సిందే నట.
దాదాపు పదిహేనేళ్ళ పాటు కొన్ని వందల ప్రోగ్రామ్స్
అలా ఒకటి రెండో కాదండోయ్ ..ఏకంగా దాదాపు పదిహేనేళ్ళ పాటు కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎవరూ చేరిపెయలేని రికార్డుని స్ప్రుష్టించింది.ముఖ్యంగా ఆమె గొంతు నుండి జాలువారిన‘నల్లజరికర మొగ్గ’, ‘కొయ్యగోర’, ‘మందులోడా’, ‘ఓరిమాయలోడా’, ‘మాలవారి మంగమ్మ’, ‘అత్తరు సాయిబోరా’ వంటి పాటలు ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాయి.
అయితే ఆవిడ చెప్పే బుర్రకథలకి మంచి ప్రశంసలు లభించినట్టే ఆ పాటల్లో డబల్ మీనింగ్ లు కూడా ఉన్నాయంటూ విమర్శలు గట్టిగానే వినిపించాయి.అయినప్పటికీ ఎవరేమన్నా తన బుర్రకథలని ఎక్కడా ఆపకుండా నిర్విరామంగా కంటిన్యూ చేయడం విశేషం.
క్రేజ్ గురించి మరింతగా చెప్పుకోవాలంటే
ఇక ఆవిడ క్రేజ్ గురించి మరింతగా చెప్పుకోవాలంటే ఖుషీ సినిమాలో వచ్చిన బాయ్ బాయ్యే బంగారు రమణమ్మ, అలాగే చిత్రం లోని మామా పారిపోతున్నాది, అలాగే జయం సినిమాలో వచ్చిన రాను రాను అంటూనే చిన్నది వంటి పాటలు అన్నింటికీ అసలు మూలం గరివిడి లక్ష్మి గారే అన్నది కాదనలేని నిజం. అంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవిడ సినిమా రంగంలో గుర్తింపు నోచుకోకపోవడం గమనార్హం.
ఇక అంత పాపులారిటీ సొంతం చేసుకున్నగరివిడి లక్ష్మి ఉన్నపళంగా కనిపించకపోవడంతో ఆవిడకి అసలేమైందంటూ ఆరాలు తీస్తున్నారు అభిమానులు.అయితే ఆవిడ ప్రస్తుతం తన ఊరిలోనే ఉన్నారని ,అయితే ట్రెండ్ మారడం, కొత్త జనరేషన్ వివిధ ఎంటర్ టైన్ మెంట్స్ కి అలవాటు పడిపోవడంతో బుర్రకథలకి ప్రాధాన్యత తగ్గిపోయింది. దాంతో పాటు వయసు కూడా పెరిగిపోవడంతో ప్రస్తుతం అన్నింటికీ దూరంగా ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నారని తెలుస్తుంది.అయితే ఆవిడ కి పద్మశ్రీ ఇవ్వాలన్న వాదన ఆమె అభిమానుల నుండి తరచూ వినిపిస్తూనే ఉంటుంది.చూడాలి ముందు ముందు ఏమైనా వస్తుందేమో .
ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ఇక ఇంతగా ఉత్తరాంద్రలో పాపులర్ అయిన గరివిడి లక్ష్మి కథ ఇపుడు సిల్వర్ స్క్రీన్ పైకి వస్తుండడం నిజంగా సంతోషించ దగ్గ విషయం. జమ్మూ గౌరీ నాయిడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో కనిపించనుంది. చూడాలి అక్టోబర్ 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !