Vanitha Fraud:కన్నడ బుల్లితెరపై తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సీరియల్ నటి వనిత ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వల్లో, లేక అవార్డు వల్లో వార్తల్లోకి రాలేదు.. ఏకంగా చీటింగ్ కేసులో బుక్కై జైలు ఊచలు లెక్కపెడుతూ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. జూన్ 23న బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తెరపై పద్ధతిగా కనిపిస్తూనే, తెరవెనుక ఆమె సాగించిన కిలాడీ లేడీ ముసుగు వీడటంతో కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెర ప్రేక్షకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఒక పక్కా స్కెచ్
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సోషల్ మీడియా హవా నడుస్తున్న ఈ రోజుల్లో దాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి వనిత ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ. కన్నడలో పలు పాపులర్ ధారావాహికలు, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వనిత, సోషల్ మీడియా వేదికగా ఒక పక్కా స్కెచ్ వేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో బాగా డబ్బున్న ప్రొఫైల్స్, కాస్త భోళాగా ఉండే యువకులను టార్గెట్ చేయడం ఆమె మొదటి స్టెప్. పరిచయం కాస్తా కాస్తా స్నేహంగా మారాక, అవతలి వ్యక్తి తనను బ్లైండ్‌గా నమ్ముతున్నాడని ఫిక్స్ అయ్యాక అసలు కథ మొదలుపెట్టేది.
తనకు అత్యవసరంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, తన బంగారం అంతా తాకట్టులో ఉందని, దాన్ని విడిపించుకోవడానికి అర్జంట్‌గా భారీ మొత్తంలో నగదు కావాలని బాధితులను నమ్మించేది. కేవలం మూడు రోజుల్లోనే మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేది. అయితే ఇక్కడే ఆమె తన అసలు క్రిమినల్ మైండ్‌ను వాడింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే పోలీసులకు దొరికిపోతామన్న భయంతో, కేవలం చేతికే డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టేది. అది కూడా నగరంలో ఎక్కడపడితే అక్కడ కాకుండా.. సీసీటీవీ కెమెరాల నిఘా అస్సలు లేని మారుమూల ప్రాంతాలను ఎంచుకుని మరీ నోట్ల కట్టలను వసూలు చేసేది.
ఒక్కసారి డబ్బు చేతికి చిక్కిందా.. ఇక అంతే సంగతులు. ఆ తర్వాత సదరు బాధితుల నంబర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, ఫోన్లు ఎత్తకపోవడం వనిత నైజం. ఇలాగే ఆమె నమ్మి మోసపోయిన ఓ యువకుడు తాజాగా బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈమె లీలలన్నీ బయటపడ్డాయి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు తెలిశాయి. వనితపై ఇప్పటికే గోవిందరాజనగర్, జ్ఞాన భారతి పోలీస్ స్టేషన్లలో కూడా ఇవే తరహా మోసాలకు పాల్పడినట్లు కేసులు నమోదై ఉన్నాయి.
పక్కా ఆధారాలతో వనితను గుట్టుచప్పుడు కాకుండా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు పోలీస్ కస్టడీ విధించింది. అయితే ఈ కిలాడీ నటి కేవలం ముగ్గురు నలుగురిని మాత్రమే కాకుండా, ఇంకా చాలా మందిని ట్రాప్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉంటుందని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. వనిత మాయమాటలు నమ్మి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, దర్యాప్తుకు సహకరించాలని బెంగళూరు పోలీసులు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి క్రైమ్ స్టోరీలు ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.