Lakshmi Menon:లక్ష్మీ మీనన్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2013 లో వచ్చిన ‘నా బంగారు తల్లి’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. అటు మలయాళంలో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా గజరాజు, చంద్రముఖి 2, ఇంద్రుడు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. అలాంటి ఈమె గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాంటి ఈమెకు ఇప్పుడు కోర్టులో భారీ ఊరట కలిగినట్లు సమాచారం.
కిడ్నాప్ కేసులో లక్ష్మీ మీనన్ కి భారీ ఊరట..
అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ నటి లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) కి ఇప్పుడు కోర్టులో ఊరట కలిగింది. సెప్టెంబర్ 17 వరకు ఈమెను అరెస్టు చేయడానికి వీలులేదని కేరళ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. లక్ష్మీ మీనన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ఆదివారం (ఆగస్టు 24) రోజు రాత్రి లక్ష్మీ మీనన్ ఆమె ముగ్గురు స్నేహితులు మిథున్, అనీష్, సోనమోల్ కలసి ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడినట్లు కొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బాధితుడు ఐటి ఉద్యోగి స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని.. లక్ష్మీ మీనన్ స్నేహితులను అరెస్టు చేశారు. అయితే లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు.కానీ ఈమె మాత్రం కోర్టుకు వెళ్లి ముందస్తు బయలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని కోరగా.. ఇప్పుడు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.
కిడ్నాప్ వెనుక గొడవకు కారణం?
కిడ్నాప్ జరగడానికి ముందు అసలు ఏం జరిగింది? ఆ గొడవ ఎందుకు అయ్యింది? అనే విషయానికొస్తే.. కొచ్చిలోని వెలాసిటీ పబ్ కు లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో వెళ్లారు. ఐటీ ఉద్యోగితో అక్కడ వివాదం జరిగింది. అతడు తన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా.. లక్ష్మీ మీనన్ స్నేహితులు తన కారును వెంబడించి, ఆ కారును ఆపి ఐటీ ఉద్యోగిని తమ కారులోకి తీసుకెళ్లి.. దాడి చేశారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లక్ష్మీ మీనన్ మాత్రం ఐటి ఉద్యోగి చేసిన ఫిర్యాదులో తమ ప్రమేయం లేదు అని, తన పరువు తీయడానికి ఇదంతా చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె.. ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసులో ఇంకెలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో చూడాలి.
ALSO READ:Spirit Shooting Update: మళ్లీ వాయిదా పడ్డ స్పిరిట్ షూటింగ్.. ఈసారి ఏమైందంటే?