AP Politics: విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ కొత్త రాజకీయ వ్యూహానికి తెర తీస్తోంది … ఉత్తరాంధ్రను వేదికగా చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని జనంలోకి తీసుకువెళ్లడానికి కొత్త ప్రణాళికలు రచిస్తోందంట… అవమానించిన చోటే అందలం ఎక్కాలనే నిర్ణయానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ నుండే రాజకీయాన్ని నడపడానికి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 వేల మంది క్రియాశీల కార్యకర్తలతో జనసేనని కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారంట … అసలు జనసేన పార్టీని జనాల్లో మరో స్థాయికి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న ఆలోచనలేంటి? రెండు తెలుగు రాష్ట్రాల కార్యకర్తల సమావేశానికి విశాఖని ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణమేంటి?
విశాఖలో జనసేన కీయాశీలక కార్యకర్తలతో భారీ మీటింగ్
విశాఖలో మూడు రోజులు జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలతో భారీ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. 28 నుంచి 30వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుండి గ్రామస్థాయిలో పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలతో సహా ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించడానికి విశాఖను కేంద్రంగా ఎంచుకున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పదవి చేపట్టిన రోజు నుండి ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వస్తున్నారు.
తరచూ ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పర్యటనలు
రెండు మూడు నెలలకు ఒకసారి ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటనలు చేస్తూ జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వ ,పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టేస్తున్నారు. ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు పార్లమెంటు, పాడేరు, అరకు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో వైసిపి బలంగా ఉండడంతో ఆ నియోజకవర్గాలను టార్గెట్ చేసి రానున్న ఎన్నికలకు జనసేనను సిద్ధం చేస్తున్నారు అనే ప్రచారం గత సంవత్సర కాలంగా జోరుగా సాగుతోంది. దీనికి తోడు రానున్న పంచాయితీ ఎన్నికలలోపు జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహాలను రచిస్తున్నారంట.
విశాఖను వేదిక చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ
అందులో భాగంగానే పార్టీకి గ్రామస్థాయిలో ఉన్న నాయకులే బలమైన పునాదులుగా భావిస్తున్న పవన్‌కళ్యాణ్ త్వరలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న 15 వేల మంది జనసేన కార్యకర్తలతో ‘సేనతో సేనాని’ పేరుతో భారీ స్థాయిలో కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమానికి కార్యచరణ రూపొందించారు. రెండు తెలుగు రాష్ట్రాల జనసేన కార్యకర్తల సమావేశానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కానీ అమరావతిని ఆనుకుని ఉన్న గుంటూరు,విజయవాడ నగరాలను కానీ, పవన్ కళ్యాణ్ భుజాన ఎత్తుకొన్న రాయలసీమ జిల్లా తిరుపతిని కానీ ఎంచుకోకుండా నేరుగా విశాఖ కేంద్రంగా ఈ సభను నిర్వహిస్తుండడంతో రాజకీయ చర్చకు దారి తీసింది
జిల్లాల పర్యటనతో రాష్ట్రాన్న చుట్టేస్తున్న బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. అధికారం పరంగా మూడు పార్టీలు కలిసి ఉన్నా, పార్టీల పరంగా ఎవరు రాజకీయ గుర్తింపును వారు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా కొనసాగుతూ టీడీపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ బీజేపీ క్యాడర్‌ను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. ఆ క్రమంలో జనసేనాని పవన్‌కళ్యాణ్ ‘సేనతో సేనాని’ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల జనసేన క్రియాశీలక కార్యకర్తలను ఒకే చోటకు తీసుకువచ్చి దిశా నిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పార్టీని ఏపీ, తెలంగాణల్లో మరింత బలోపేతం చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన కరెక్ట్ గానే ఉన్నా విశాఖనే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది.
2019లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్
అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోగొట్టుకున్నామో, ఎక్కడ అవమానపడ్డామో అక్కడ నుంచే తమ సత్తా చాటాలనే ఆలోచన చేస్తున్నట్లు ఈ కార్యకర్తల సమావేశాన్ని విశాఖలో నిర్వహించడం ద్వారా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు. తర్వాత పార్టీని నిలబెట్టుకోవడానికి రెండుసార్లు విశాఖ వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్‌ను ఒకసారి రోడ్డుపైన, మరోసారి హోటల్లోనే నిలబెట్టడం లాంటివి జనసేనాని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్తున్నారు. అందుకే జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఓటమి చెందిన విశాఖ నుండి జనసేన పార్టీ రాజకీయ ఎదుగుదలకు కొత్త ఎజెండా రెడీ చేయడానికి విశాఖనే కేంద్రంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
గ్రామస్థాయిలో క్యాడర్ బలోపేతంపై పవన్ దృష్టి
2029 ఎన్నికలకు ఇంకా దాదాపుగా మూడున్నర సంవత్సరాలు సమయం ఉంది. ఈ మూడున్నర సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేయడం ముఖ్యంగా గ్రామస్థాయిలో పార్టీ కేడర్ ను బలంగా తయారు చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పంచాయతీ ఎన్నికల నాటి నుంచే గ్రామాల్లో తమ ఉనికిని పెంచుకోవడానికి జనసేనని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలపైనే దృష్టి పెట్టడం కాకుండా తెలంగాణలోని గ్రామాలలో కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానులను, జనసేన పార్టీ క్యాడర్ ను ఒక తాటిపైకి తీసుకువచ్చి రానున్న పంచాయితీ ఎన్నికల్లో బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నారంట.
ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారిన జనసేన
2014 ఎన్నికల జనసేన పార్టీని స్థాపించిన తర్వాత జనసేనని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి, రాష్ట్రంలో మంత్రులుగా పరిపాలనలో భాగస్వాములు అయ్యారు. ఎమ్మెల్సీలుగా పదవులు చేపడుతున్నారు. వివిధ నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీ నాయకులు నియమితులవుతున్నారు. ఆ క్రమంలో తెలంగాణలో కూడా జనసేన పార్టీని కీలకమైన పార్టీగా నిలబెట్టడానికి గ్రామస్థాయిలో ఉండే క్రియాశీల నాయకత్వాన్ని సిద్ధం చేసి, కార్యకర్తలకు న్యాయం చేయడానికి ‘సేనతో సేనాని’ కార్యక్రమానికి రూపకల్పన చేసి విశాఖ వేదికగా తెలంగాణ జనసైనికులను విశాఖ రప్పిస్తున్నట్లు తెలుస్తోంది…
కొత్త నిర్ణయాలతో పార్టీ క్యాడర్‌కు మార్గనిర్దేశం..
ముఖ్యంగా కూటమి పార్టీ అధికారంలో ఉండడం మూడు పార్టీల నాయకులు అమరావతిలో పాగా వేయడంతో అమరావతికి దూరంగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కొత్త నిర్ణయాలను కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెప్తున్నారు.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీగా గడిపేశారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయిలో జనసేన సంస్థాగత నిర్మాణం చేయలేకపోయారు. తెలంగాణలో జనసేన పార్టీని పూర్తిగా గాలికి వదిలేసారు… ఇప్పుడు మిగిలిపోయిన అరకొర సినిమాలు తప్ప పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మరో ఐదేళ్లు సినిమాలు చేసే అవకాశం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీని నిలబెట్టుకోవదానికి పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచ్ వేసారంటున్నారు.సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. దానికి ముందు రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీల కార్యకర్తలతో భారీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై నాయకులకు ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుంది..
3 రోజులు విశాఖలో మకాం వేయనున్న పవన్‌కళ్యాణ్
ఆగస్టు 28 నుండి 30వ తేదీ వరకు జరిగే సేనతో సేనాని కార్యక్రమంలో మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉండనున్నారు.. 28న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం, 29వ తేదీ ఎంపీలు పార్లమెంట్ నాయకులతో సమావేశం నిర్వహించడమే కాకుండా 30వ తేదీ 15 వేల మంది క్రియాశీల కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడి జనసేన పార్టీ భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని వివరించనున్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగస్వామిగా జనసేన పార్టీ ఉన్న భవిష్యత్తు రాజకీయం ఎటువైపు వెళుతుందో ఎవ్వరు చెప్పలేము కాబట్టి సొంత క్యాడర్‌ను సిద్ధం చేసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జనసేన కొత్త పంథాలో అడుగులు వేస్తుందా?
ఈ భారీ సభ కోసం ఇప్పటికే జనసేన ప్రత్యేకంగా 12 కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు రోజులు పాటు జరిగే జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లను ఈ 12 కమిటీల నాయకులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 15వేల మంది కార్యకర్తల సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుండడంతో పార్టీ భవిష్యత్తు, రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇక్కడ స్పష్టంగా కార్యకర్తలకు అర్థమయ్యే అవకాశం కనిపిస్తోంది… అయితే జనసైనికులలో మాత్రం ఈ మహాసభ తర్వాత జనసేన కొత్త పంధాలో అడుగులు వేస్తుందా లేక ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతుందా అని సందేహాలు వేధిస్తున్నాయంట… ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ను భవిష్యత్తు ఏపీ సీఎంగా ఊహించుకుంటున్నారు ఆయన అభిమానులు. అయితే మరో 15 ఏళ్లు చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని స్వయానా పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్నారు. నేపథ్యంలో ఈ మహాసభ ద్వారా కార్యకర్తలకు ఎలాంటి దిశ నిర్దేశం ఇస్తారో అని క్రియాశీలక కార్యకర్తలు ఎదురు చూస్తున్నారంట.
ఇకపై డిప్యూటీ సీఎం కొత్త సినిమాలు అంగీకరిస్తారా?
ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో ఉన్న క్రేజ్ కు తోడు డిప్యూటీ సీఎంగా పదవి ఉండడంతో ఈ సభకు మరింత ప్రాధాన్యత పెరిగింది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలలో నటిస్తారా లేదా అనే సందేహం పార్టీ కేడర్ తో పాటు ఆయన అభిమానులను పట్టిపీడిస్తుంది.. దానికి తోడు గ్యాంగ్ స్టర్ రోల్ లో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదలకు ముందే విశాఖలో మహాసభ జరగడం రాజకీయంగానే కాకుండా సినీ కెరియర్ పై కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది.
Also Read: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మీటింగులోఅటు సినిమా కెరర్‌పై ఇటు రాజకీయ ప్రయాణంపై ఓ సర్‌ప్రైజ్ ఇస్తారని భావిస్తున్నారు… పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ముందు విశాఖలో జనసేన పార్టీ మహాసభ జరగడం, 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలో నిర్వహించిన తర్వాత, ఆ స్థాయిలో పార్టీ క్యాడర్ ఒకచోటకు చేర్చి భారీ సభ నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు విశాఖలో ఈ మహాసభను నిర్వహించి రానున్న దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీ దిశ నిర్దేశాన్ని పవన్ కళ్యాణ్ చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరి విశాఖలో జరిగే ఈ మహాసభలో జనసేనాని ఎలాంటి సందేశం ఇచ్చి , క్యాడర్ సందేహాలను ఎలా నివృత్తి చేస్తారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv