Dasari Kiran: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న దాసరి కిరణ్ (Dasari kiran) ను ఏపీ పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విషయంలో బుధవారం (ఆగస్టు 20) నాడు విజయవాడ పోలీసులు హైదరాబాదులో దాసరి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి దాసరి కిరణ్ విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆర్థిక లావాదేవీల విషయంలో అరెస్టు చేయడం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఎవరు ఈయనపై కేసు ఫైల్ చేశారు? ఇలా పలు కోణాలలో అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.
ఆర్థిక లావాదేవీల కేసులో దాసరి కిరణ్ అరెస్ట్..
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న దాసరి కిరణ్ దగ్గర బంధువైన గాజుల మహేష్ (Gajula Mahesh)ఒక ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారట. రెండేళ్ల క్రితం మహేష్ వద్ద కిరణ్ రూ.4.5కోట్లు అప్పుగా తీసుకున్నారట. తిరిగి డబ్బు ఇవ్వమని అనేకసార్లు మహేష్ అడిగినా.. దాసరి కిరణ్ పట్టించుకోలేదట. దీంతో ఆగస్టు 18వ తేదీన మహేష్ తన భార్యతో కలిసి నేరుగా విజయవాడలోని కిరణ్ ఆఫీసుకు వెళ్ళగా.. అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది ఈ జంటపై దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దాడి అనంతరం మహేష్ తన భార్యతో కలిసి విజయవాడ పటమట పోలీసులకు దాసరి కిరణ్ పై ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు దాసరి కిరణ్ ను హైదరాబాదులో అరెస్టు చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దాసరి కిరణ్ నిర్మించిన చిత్రాలు..
రామదూత క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించిన దాసరి కిరణ్.. ఈ బ్యానర్ పై పలు తెలుగు చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అటు హవీష్ హీరోగా వచ్చిన ‘జీనియస్’ సినిమాని కూడా రూపొందించింది దాసరి కిరణ్ కావడం గమనార్హం.. ఇక ప్రముఖ సీరియల్ నటుడు ఆర్కే సాగర్ (RK Sagar) తో ‘సిద్ధార్థ్’ అనే మూవీని కూడా నిర్మించారు.
వ్యూహం సినిమాతో భారీ గుర్తింపు..
ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘వ్యూహం’ చిత్రాన్ని కూడా దాసరి కిరణ్ నిర్మించడం గమనార్హం.ఈ చిత్రానికి ఆర్జీవీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా కేసులో అటు రాంగోపాల్ వర్మ(Ram gopal Varma) కూడా పోలీస్ కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దాసరి కిరణ్ ఇలా ఆర్థిక లావాదేవీల విషయంలో అరెస్ట్ అవడం మరింత సంచలనంగా మారింది. విచారణ నిర్వహించి పూర్తి వివరాలు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ: Rahul Sipligunj: కన్యాకుమారిలో రాహుల్ సిప్లిగంజ్.. నిన్న నిశ్చితార్థం.. నేడు పూజలు